టీఆర్‌ఎస్‌.. బీజేపీకి బీ టీమ్‌

26 Nov, 2021 01:22 IST|Sakshi
ఇందిరాపార్కు వద్ద జరిగిన మహాధర్నాలో మాట్లాడుతున్న రాకేశ్‌ తికాయత్‌ 

రైతు నాయకుడు రాకేశ్‌ తికాయత్‌ విమర్శ 

కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే సరిపోదు... రైతుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి 

భవిష్యత్‌ కార్యాచరణపై రేపు ఏఐకేఎస్‌సీసీ భేటీ...

ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో ‘మహా ధర్నా’ 

కవాడిగూడ/పంజగుట్ట: ‘టీఆర్‌ఎస్‌ను రాష్ట్రంలోనే ఉంచండి. బీజేపీకి కొమ్ముకాసే పార్టీ. బీజేపీకి బీ టీమ్‌’అని బీకేయూ నేత రాకేశ్‌ తికాయత్‌ విమర్శించారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన సరిపోదని.. ప్రతి పంటకూ మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కనీస మద్దుత ధర హామీ చట్టం, విత్తన చట్టం, క్రిమి సంహారక చట్టం, విద్యుత్‌ సవరణ బిల్లు ఉపసంహరణతో పాటు రైతుల ఇతర న్యాయమైన డిమాండ్లపై ప్రధాని నరేంద్ర మోదీ తమతో చర్చించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఢిల్లీలో రైతు ఉద్యమం మొదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ), సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో జరిగిన మహా ధర్నాలో తికాయత్‌ పాల్గొని మాట్లాడారు.  

భాష వేరైనా మన భావం ఒక్కటే 
పార్లమెంట్‌లో ఓటేసే అవకాశం ఇవ్వకుండా, రాజ్యసభలో మంద బలంతో 3 రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారని తికాయత్‌ విమర్శించారు. రైతులకు నష్టం కల్గిస్తున్న ఈ చట్టాల రద్దు కోసం చేసిన ఉద్యమానికి విదేశాలల్లోనూ మద్దతు వచ్చిందని, అందుకే రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్, కంపెనీలు నడుపుతున్నాయని ఆరోపించారు. భాష వేరైనా మన భావం ఒక్కటేనని రైతులను ఉద్దేశించి తికాయత్‌ అన్నారు. ఏఐకేఎస్‌సీసీ 27న సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తుందని తెలిపారు.  

  గోల్కొండ రైతుల సమస్యపై కేసీఆర్‌కు లేఖ రాస్తా: తికాయత్‌ 
ఎంఎస్‌పీ హామీ చట్టం.. అమరులైన 750 మంది రైతులకు పరిహారమని తికాయత్‌ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గోల్కొండ కోట లోపల సాగు చేసుకుంటున్న రైతుల నుంచి ప్రభుత్వం భూమిని గోల్ఫ్‌ కోర్స్‌ కోసం తీసుకుందని, కానీ పరిహారం ఇవ్వలేదని చెప్పారు. దీనిపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని అన్నారు.  

మరిన్ని వార్తలు