మానవత్వం కూడా లేదా?

14 Sep, 2021 03:28 IST|Sakshi
బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శిస్తున్న రేవంత్‌రెడ్డి  

బంధువు పరామర్శకు వెళ్లిన కేసీఆర్‌.. బాలిక కుటుంబాన్ని ఎందుకు ఓదార్చలేదు? 

గిరిజన బాలికపై అత్యాచారం, హత్యోదంతంపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి 

డ్రగ్స్‌కు కేటీఆర్, మద్యానికి కేసీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారారని ధ్వజం 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నడిబొడ్డున గిరిజన బాలిక అమానుషంగా అత్యాచారానికి, హత్యకు గురైతే, బాధిత కుటుంబాన్ని పరామర్శించేంత మానవత్వం కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి లేకుండాపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తన బంధువు తండ్రి మరణిస్తే ఆగమేఘాలపై ఢిల్లీ నుంచి వచ్చి పరామర్శించిన కేసీఆర్‌ బాలిక కుటుంబాన్ని ఎందుకు ఓదార్చలేదని ప్రశ్నించారు.

దొరలకో న్యాయం, దళిత, గిరిజనులకు మరో న్యాయమా అని నిలదీశారు. ఇక్కడి సింగరేణి కాలనీలోని బాధిత కుటుంబాన్ని రేవంత్‌ సోమవారం పరామర్శించారు. దేవరకొండ, ఎల్బీనగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు బాధిత కుటుంబానికి రేవంత్‌ చేతుల మీదుగా రూ.1.5 లక్షలను అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హోంమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో ఘటన జరిగితే ఆయనగానీ, సింగరేణి కాలనీని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న మంత్రి కేటీఆర్‌గానీ, నగర మంత్రులుగానీ ఎందుకు స్పందించటం లేదన్నారు.

నిందితుడ్ని పట్టుకోవడం పోలీసులకు చేతకావట్లేదన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌కు మంత్రి కేటీఆర్, మద్యానికి సీఎం కేసీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారారని రేవంత్‌ ఎద్దేవా చేశారు. ఇదిలాఉండగా, గాంధీభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలానికి చెందిన సామాజిక కార్యకర్త గుజ్జుల మహేష్‌.. రేవంత్‌రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలసి కాంగ్రెస్‌లో చేరారు.   

కేసీఆర్‌ గుండెల్లో దడపుట్టించాలి 
‘సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నిర్వహించబోయే దళిత, గిరిజన ఆత్మగౌరవసభ ఆరంభం మాత్రమే. గజ్వేల్‌ను కొల్లగొట్టాలి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు దండుకట్టి దండోరా మోగించి కేసీఆర్‌ గుండెల్లో దడపుట్టించాలి’ అని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ బలవంతుడు కాదని, నక్కజిత్తుల మనిషి అని విమర్శించారు.

 సోమవారం గాంధీభవన్‌లో రేవంత్‌ అధ్యక్షతన కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఏడున్నరేళ్లుగా సీఎం కేసీఆర్‌ చేతిలో దళితులు, గిరిజనులు దగా పడుతూనే ఉన్నారన్నారు. అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం పెడతానని చెప్పిన కేసీఆర్‌.. ఆ విగ్రహం పెట్టకపోగా కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ తెచ్చిన అంబేద్కర్‌ విగ్రహాన్ని పోలీస్‌స్టేషన్‌లో పెట్టారని మండిపడ్డారు. దీనిపై వీహెచ్‌ పోరుకు పార్టీ మద్దతు ఉంటుందని, గజ్వేల్‌ సభలో దీనిపై తీర్మానం చేస్తామన్నారు. 

ఇందిరను గెలిపిస్తే పరిశ్రమలొచ్చాయి 
గతంలో మెదక్‌ ఎంపీగా ఇందిరాగాంధీని అక్కడి ప్రజలు గెలిపిస్తే పెద్దసంఖ్యలో పరిశ్రమలు వచ్చాయని, లక్షల మందికి ఉపాధి కలిగిందని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌ జలాశయాల్లో దళిత, గిరిజనుల ఆకాంక్షలు జలసమాధి అయ్యా యి. కేసీఆర్‌కు ఇవన్నీ తెలియాలంటే గజ్వేల్‌ సభను లక్షమందికి తగ్గకుండా నిర్వహించాలి. తెలంగాణలో సోనియమ్మ రాజ్యం రావాలంటే గజ్వేల్‌ కోటను బద్దలుకొట్టాలి’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

కేడర్‌లో నమ్మకం వస్తోంది: జానారెడ్డి 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు జరుగుతున్న కృషి అభినందనీయమని, తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కేడర్‌కు కలుగుతోందని సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి అన్నారు. దళితబంధుతో పాటు బీసీలకు బీసీబంధు ఇవ్వాలని మాజీ ఎంపీ వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. ఏడేళ్లుగా కేసీఆర్‌ చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ కార్యకర్తలపై ఉందని మధుయాష్కీగౌడ్‌ అన్నారు.

గజ్వేల్‌ సభను విఫలం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని దామోదర రాజనర్సింహ ఆరోపించారు. సమావేశంలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, నేతలు చిన్నారెడ్డి, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, ఆర్‌.దామోదర్‌రెడ్డి, సురేశ్‌ షెట్కార్, సంభాని చంద్రశేఖర్, జాఫర్‌ జావేద్, జి.నిరంజన్, ఏఐసీసీ కిసాన్‌సెల్‌ వైస్‌చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు