బడితెపూజ∙తప్పదు!

13 Oct, 2021 03:46 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి

‘పాలమూరు జంగ్‌ సైరన్‌’ సభలో కేసీఆర్‌పై  రేవంత్‌ ఫైర్‌]

రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే.. 

ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌ హయాంలో చేపట్టినవే.. 

కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలను మోసం చేశారని ధ్వజం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘‘రాష్ట్రంలో 1,91,000 ఉద్యోగ ఖాళీలను భర్తీచేసే వరకు, రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చేవరకు ఆందోళనలు చేపడతాం. మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేదాకా సీఎం కేసీఆర్‌కు బడితెపూజ తప్పదు’’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మున్సిపాలిటీలోని అమిస్తాపూర్‌లో ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ సభ నిర్వహించారు.

నేతలు  ఎనుగొండ నుంచి మహబూబ్‌నగర్‌ పట్టణం మీదు గా వందలాది వాహనాలతో ర్యాలీగా సభ వద్దకు చేరుకున్నారు. రేవంత్‌ టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాక సొంతజిల్లాలో తొలిసారిగా నిర్వహిం చిన ఈ సభకు జనం భారీసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా రేవంత్‌ చేసిన ప్రసంగం ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. 

ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని.. 
‘‘తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగినప్పుడు కేసీఆర్‌ ఆ ముసుగులో రాజకీయ పార్టీని విస్తరించుకున్నారు. పదవులు అనుభవించారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో హరీశ్‌రావుసహా అరడజను మంది మంత్రి పదవులు తీసుకున్నారు. ఆ సమయంలోనే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పోతిరెడ్డిపాడు వెడల్పు పెంచి వందల టీఎంసీల కృష్ణానీటిని రాయలసీమకు తరలించింది. తెలంగాణ హక్కు అయిన జూరాల పూర్తికాలేదు. నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి కట్టలేదు.

ఇవన్నీ వదిలేసి రాయలసీమకు నీళ్లు తరలించుకుపోతుంటే.. కేసీ ఆర్‌ మంత్రి పదవుల కోసం రాజశేఖరరెడ్డి కాళ్ల దగ్గర గులాంగిరీ చేశారు. 2008 ఉప ఎన్నికల్లో సమైక్యవాదులతో చీకటి ఒప్పందం చేసుకుని.. తెలంగాణ హక్కులు, రైతుల జీవితాలను తాకట్టుపెట్టారు. 2009లో తెలంగాణ ద్రోహుల పార్టీ అని చెప్పిన టీడీపీతో పొత్తుపెట్టుకొని 45 ఎమ్మెల్యే, 9 ఎంపీ స్థానాలకు పోటీæపడ్డారు.

నీ (కేసీఆర్‌) నీచమైన బుద్ధి చూసి 35 మందికి డిపాజిట్‌ కూడా రాలేదు. ఈటల రాజేందర్‌ను ‘నీ తల ఎక్కడ పెట్టుకుంటావ్‌’ అని అసెంబ్లీలో వైఎస్‌ అన్నప్పుడు కేసీఆర్‌ పౌరుషం ఎక్కడ పోయింది? తెలంగాణ పోరాటాన్ని పక్కనపెట్టిన కేసీఆర్‌ను కరీంనగర్‌ జిల్లా ప్రజలు బొందపెడ్తారనే పాలమూరు జిల్లాకు వలసవచ్చారు. ఇక్కడి ప్రజలు మంచితనంతో ఎంపీగా గెలిపించారు కాబట్టే.. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టిన రోజున తానే కొట్లాడి తెచ్చానని మాట్లాడే అవకాశం కేసీఆర్‌కు వచ్చింది. 

అందుకే జంగ్‌ సైరన్‌.. 
తెలంగాణ అభివృద్ధి, పునర్నిర్మాణం పాలమూరు నుంచే మొదలుపెడ్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చి.. ఇక్కడి 50 లక్షల మందికి అన్యాయం చేశారు. పాలమూరు ప్రాజెక్టును బొంద పెట్టి ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చారు. టీఆర్‌ఎస్‌ హయాంలో పరిశ్రమలు రాలేదు. విద్య, ఉపాధి అవకాశాలూ కల్పించలేదు. అందుకే పాలమూరు గడ్డ మీదినుంచే జంగ్‌ సైరన్‌ మోగిస్తున్నాం. పాలమూరు బిడ్డగా నన్ను ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ఎంపీలను గెలిపించండి. జిల్లా రూపురేఖలు మారుస్తా.

ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌ హయాంలోనివే.. 
జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్, శ్రీశైలం, నాగార్జునసాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కట్టినవే. చివరికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సర్వే రిపోర్ట్‌ చేసి ఆదేశాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమే. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక.. రూ.వెయ్యి కోట్లు ఇస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తయి, 10 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతాయని అడిగితే స్పందించలేదు. 

కార్యకర్తలను వేధిస్తే ఊరుకోబోం.. 
కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. దేవరకద్రలో మహేశ్‌ అనే యువకుడిని టీఆర్‌ఎస్‌ వాళ్లు కొట్టి చంపారు. కొందరు పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. కేసీఆరే ఎప్పటికి ఉంటాడని అనుకోవద్దు. కార్యకర్తల ను వేధిస్తే ఊరుకోబోం’’ అని రేవంత్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు