టీఆర్‌ఎస్, బీజేపీలకు ఓటేస్తే ఒరిగేదేమీ లేదు: రేవంత్‌

28 Oct, 2021 04:39 IST|Sakshi
హుజూరాబాద్‌ రోడ్‌ షోలో మాట్లాడుతున్న రేవంత్‌ 

కరీంనగర్‌టౌన్‌: టీఆర్‌ఎస్, బీజేపీలకు ఓటేస్తే హుజూరాబాద్‌ ప్రజలకు ఒరిగేదేమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీలు ఓడిపోతే కేసీఆర్, మోదీ పదవులెక్కడికీ పోవని అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే అహంకారంతో విర్రవీగుతున్న ఆ రెండు పార్టీలను బొంద పెడతామని పేర్కొన్నారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ తరఫున బుధవారం హుజూరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో రేవంత్‌ మాట్లాడారు.

ఉపఎన్నిక కేవలం ఇద్దరు వ్యక్తుల పంపకాల పంచాయితీతోనే వచ్చిందని ఆరోపించారు. అమరవీరుల కుటుంబాలను కేసీఆర్‌ పట్టించుకోకపోయినా, రైతుల సమస్యలపై టీఆర్‌ఎస్‌ స్పందించకపోయినా ఈటల రాజేందర్‌ ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. మంత్రి హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ ఓట్ల కోసం ఒకరిపై ఒకరు తిట్ల దండకం చదువుతున్నారని, బడేమియా చోటామియా లాగా ఇద్దరు తోడుదొంగలేనని మండిపడ్డారు. ‘మీకు పంచాయితీ వచ్చిందని మేం కత్తులు పట్టుకొని నరుక్కోవాలా. ఇదెక్కడి దుర్మార్గం.

కేసీఆర్‌ గాడిదను పెట్టి గెలిపిస్తానన్నారు. గాడిదకు ఓట్లు వేస్తే పేదల కష్టం గురించి మాట్లాడతారా’అని రేవంత్‌ ప్రశ్నించారు. ఎలాగైనా గెలవాలని టీఆర్‌ఎస్‌ ఒక్కో ఓటుకు రూ.6 వేల చొప్పున రూ.120 కోట్లు పంచుతోందని ఆరోపించారు. బీజేపీ కూడా అదే స్థాయిలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సిద్ధమైందన్నారు. పైసలు తీసుకొని బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు కర్రుకాల్చి వాతపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

హుజూరాబాద్‌ వస్తే నిరుద్యోగులు తరిమి కొడతారనే భయంతోనే సీఎం సభ పెట్టలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌కు రాని అడ్డంకులు సీఎంకు సభకు వచ్చాయంటే ఎవరూ నమ్మరని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు