రూ.10 వేల కోట్లతో వడ్లు కొనలేరా?

15 Nov, 2021 02:15 IST|Sakshi

ధర్నాల్లో కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదు: రేవంత్‌ 

హుజూరాబాద్‌ సమీక్ష అర్థవంతంగా జరిగింది: భట్టి

సాక్షి, హైదరాబాద్‌: వడ్ల కొనుగోలుకు ఈ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు వెచ్చించలేదా అని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ రాష్ట్ర రైతాంగానికి ఆ మాత్రం చేయలేరా అని నిలదీశారు. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్‌ నేతలతో కలసి ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ధాన్యం కొనాలంటూ టీఆర్‌ఎస్‌ నిర్వహించిన ధర్నాల్లో కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌కు నిజంగా వరి రైతులపై ప్రేమ ఉంటే ఆయన ఢిల్లీ వెళ్లి జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. ప్రత్యేక బడ్జెట్‌ పెట్టి అయినా రాష్ట్రంలోని ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాల్సిం దేనని డిమాండ్‌ చేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలను అడ్డగోలుగా అమ్మేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో ఓటమిపై ఢిల్లీ వార్‌రూంలో ఏఐసీసీ నేతల సమక్షంలో అర్థవంతమైన చర్చ జరిగిందని చెప్పారు.  

మరిన్ని వార్తలు