కష్టపడండి... ఇంటికొచ్చి బీఫారం ఇస్తా

22 Aug, 2021 02:12 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్‌.  చిత్రంలో మాణిక్యం ఠాగూర్‌

కాంగ్రెస్‌ పార్టీకి ఓనర్లు లేరు... ఎవరు కష్టపడితే వారే ఓనర్లు

వైఎస్, చంద్రబాబు, కేసీఆర్‌ లాంటి నేతలు కూడా యూత్‌ కాంగ్రెస్‌ నుంచి వచ్చినవారే

యువజన కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘నేను యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షు డిని, నాకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమి వ్వండి.. యూత్‌ కాంగ్రెస్‌ వాళ్లకు టికెట్లు ఇవ్వరా? ఆ కోటాలో మాకు టికెట్లివ్వండి అంటే ఇచ్చేది లేదు’ అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం గా పోరాడి మోకాలిచిప్పలు పగులగొట్టుకుంటే రాహుల్‌పక్కన కూర్చునే అవకాశం దక్కిందని, అలా కష్టపడి పనిచేసే నాయకులకు కాంగ్రెస్‌ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.

యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు కష్టపడి పనిచేస్తే ఇంటికే వచ్చి బీఫారం ఇస్తానని హామీ ఇచ్చారు. శనివారం శంషాబాద్‌లోని మేఫెయిర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో శివసేనారెడ్డి అధ్యక్షతన యూత్‌ కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో రేవంత్‌ మాట్లాడుతూ, ఈ దేశానికి, రాష్ట్రానికి ఎంతో మంది నాయకులను అందించిన చరిత్ర యూత్‌ కాంగ్రెస్‌కు ఉందన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్‌ లాంటి నాయకులు కూడా యువజన కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వారేనని తెలిపారు.

అయితే, వారంతా ఎంతో కష్టపడి నాయకులుగా ఎదిగారని, ప్రస్తుత యూత్‌ కాంగ్రెస్‌ నాయకత్వం కూడా క్రియాశీలకంగా పనిచేయాలని పేర్కొన్నారు. ఏ పార్టీలో అయినా సంక్షోభ సమయంలోనే నాయకులు తయారవుతారని, ఆ స్థితి ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉందని, అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌కు ఓనర్లు ఎవరూ లేరని, ఎవరు కష్టపడి పనిచేస్తే వారే నాయకులని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 

సవాల్‌గా తీసుకుని పోరాడాలి: మాణిక్యం 
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు పనిచేయాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ పిలుపునిచ్చారు. ‘వచ్చే ఎన్నికల్లో 72 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడమే మన లక్ష్యం. ఇంకా 20 నెలల సమయమే ఉంది. దీన్ని సవాల్‌గా తీసుకోవాలి.

మనం గెలిచి తీరాలి అనే కసితో పనిచేయాలి’ అని వ్యాఖ్యానించా రు. సమావేశానికి యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్, రాష్ట్ర ఇన్‌చార్జి కృష్ణ అల్లవారు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్‌ యాదవ్, మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సంపత్‌కుమార్, మాజీ మంత్రులు షబ్బీర్‌అలీ, మల్లురవితో పాటు యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లాల, పార్లమెం టు, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు హాజరయ్యారు.  

మరిన్ని వార్తలు