కంటోన్మెంట్‌పై చెరగని ముద్ర వేసిన సాయన్న.. అంచెలంచెలుగా ఎదిగి

20 Feb, 2023 09:09 IST|Sakshi

బ్యాంకు క్లర్క్‌ నుంచి ఎమ్మెల్యే దాకా  

అజాతశత్రువుగా పేరు ప్రఖ్యాతులు 

విలక్షణ వ్యక్తిత్వంతో ప్రత్యేక గుర్తింపు  

పేదలకు ఎల్లవేళలా అందుబాటులో 

అనారోగ్యంతో ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత  

నియోజకవర్గ పరిధిలో విషాద ఛాయలు

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న ఇక్కడ తనదైన ముద్ర వేశారు. అందరికీ తలలో నాలుకలా.. అజాత శత్రువుగా.. వివాద రహితుడిగా ఆయనకు ఎంతో పేరుంది. ఆదివారం మధ్యాహ్నం కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారనే వార్తతో నియోజకవర్గ పరిధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సీఎం కేసీఆర్‌ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు నివాళులు అరి్పంచారు. బ్యాంక్‌ క్లర్కు ఉద్యోగం నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా సాగిన సాయన్న రాజకీయ ప్రస్థానం ఇలా సాగింది..

 నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం వాల్వాపూర్‌లో జన్మించిన సాయన్న.. నగరంలోని న్యూసైన్స్‌ కాలేజీలో బీఎస్సీ, అనంతరం ఎల్‌ఎల్‌బీ చేశారు. 1978లో సిండికేట్‌ బ్యాంకులో క్లర్క్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో పాటు 1986లోనే రాజకీయాల్లోకి వచి్చన ఆయన.. 1986 బల్దియా ఎన్నికల్లో దోమలగూడ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం మళ్లీ సికింద్రాబాద్‌ ఆర్‌పీ రోడ్డులోని సిండికేట్‌ బ్యాంకులో చేరారు.  

1994లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి టీడీపీ అభ్యరి్థగా టికెట్‌ దక్కడంతో చివరి నిమిషంలో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వరుసగా 1999, 2004 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే అయ్యారు. 2009లో నియోజకవర్గాల పునరి్వభజనతో కంటోన్మెంట్‌ పరిధిలోని మల్కాజిగిరి, అల్వాల్, ఓల్డ్‌ బోయిన్‌పల్లి వంటి ప్రాంతాలు వేరే నియోజకవర్గాల్లోకి మారిపోయాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పి.శంకర్‌రావు చేతిలో 4,183 ఓట్ల తేడాతో ఓడిపోయారు.  

2014 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌ బలంగా ఉన్నప్పటికీ, సాయన్న తన విలక్షణ నైజంతో కంటోన్మెంట్‌ ఓటర్ల అభిమానాన్ని చూరగొన్నారు. కంటోన్మెంట్‌ బోర్డు సభ్యులెవరూ తనకు అండగా నిలవకపోయినప్పటికీ ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో ఆయన వ్యక్తిత్వం కీలకమైంది. 2018లో టీఆర్‌ఎస్‌ అభ్యరి్థగా భారీ మెజారిటీతో గెలిచి అయిదోసారి ఎమ్మెల్యే అయ్యారు. సాయన్నకు మంత్రి పదవి లభిస్తుందని అభిమానులు ఆశించినప్పటికీ ఆ కోరిక నెరవేరలేదు. 

నిరాడంబరుడు..  వివాద రహితుడు.. 
మొదటిసారిగా 1986లో ముషీరాబాద్‌ నియోజకవర్గం  దోమలగూడ డివిజన్‌ నుంచి టీడీపీ కార్పొరేటర్‌ అభ్యరి్థగా పోటీ చేసిన సాయన్న  ఓడిపోయారు. అనంతరం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. దోమలగూడ డివిజన్‌ అనంతరం కవాడిగూడ డివిజన్‌గా రూపాంతరం చెందింది. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) నుంచి కవాడిగూడ కార్పొరేటర్‌గా సాయన్న కుమార్తె లాస్య నందిత గెలుపొందారు. అయిదు పర్యాయాలు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సాయన్న సౌమ్యుడు, నిరాడంబరుడు, వివాదరహితుడు మాత్రమే కాక స్నేహశీలి, హాస్యచతురుడు. అందరితో కలుపుగోలుగా ఉండే సాయన్న మంచి భోజన ప్రియుడు. వెరైటీ వంటకాలంటే ఇష్టం. సినిమాలు, వినోదకార్యక్రమాలపై ఆసక్తి. సినిమాల గురించి చర్చించేవారు. రాజకీయాల్లో ఉన్నా అజాత శత్రువుగా పేరుపొందారు.    

అన్నా అని వస్తే.. నేనున్నా అనేవారు.. 
అయిదు సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టిన సాయన్న విలక్షణమైన వ్యక్తిత్వంతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బ్యాంకు ఉద్యోగి అయిన సాయన్న రాజకీయాల్లోనూ పక్కా లెక్కలతో ఉండేవారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే నియోజకవర్గంలోని ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకున్నారు. తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరితో వ్యక్తిగత అనుబంధం కలిగి ఉండేవారు. నియోజకవర్గం పరిధిలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో దాదాపు ప్రతిసారీ సాయన్న వ్యతిరేక పారీ్టల అభ్యర్థులే గెలిచే వారు. 1997 బోర్డు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఒక్కరు మాత్రమే గెలిచినప్పటికీ, 1999 ఎన్నికల్లో సాయన్న విజయం సాధించారు. తిరిగి 2004లో సాయన్న ఎమ్మెల్యేగా ఉండగానే 2006, 2008లోనూ బోర్డు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లోనూ ఒక్క టీడీపీ అభ్యర్థి కూడా గెలవలేదు.  

2015లోనూ టీడీపీ అభ్యర్థులకు బోర్డులో ప్రాతినిధ్యమే దక్కలేదు. బోర్డు సభ్యులు తాము వేరే పారీ్టల్లో కొనసాగుతున్నప్పటికీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో మాత్రమే సాయన్న గెలుపు కోసం పనిచేసే వారని తెలుస్తోంది. ప్రత్యర్థి పారీ్టల్లోని నేతలతోనూ సాయన్న సన్నిహితంగా ఉండే వారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్నా అంటూ తనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికీ తన వంతు సహకారం అందించే వారు. ఇక మిలిటరీ అధికారుల పెత్తనం మితిమీరి ఉండే కంటోన్మెంట్‌లో కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలకు అండగా నిలిచేవారు. ప్రతి కాలనీ, బస్తీ పెద్దలతో నిత్యం టచ్‌లో ఉండేవారు. ఎన్నికల్లో ఆయా కాలనీ సంక్షేమ సంఘాలు, కాలనీ ప్రతినిధులు పారీ్టలకు అతీతంగా సాయన్న గెలుపు కోసం పనిచేసే వారు. ఈ నేపథ్యంలోనే సాయన్న అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు.  

ముఠా గోపాల్‌తో ఎంతో అనుబంధం 
ప్రస్తుత ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్, సాయన్న చిరకాల మిత్రులు. ఇద్దరూ ఒకేసారి రాజకీయ అరంగేట్రం చేశారు. 1986 కార్పొరేటర్‌ ఎన్నికల్లో అప్పటి జవహర్‌నగర్‌ డివిజన్‌ నుంచి టీడీపీ అభ్యరి్థగా పోటీ చేసిన ముఠా గోపాల్‌  గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో ఉన్నంత కాలం ముఠాగోపాల్‌ ఆశించిన ముషీరాబాద్‌  అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ మిత్రపక్షాలకు కేటాయించేవారు. దీంతో టీడీపీలో ఉన్నంతకాలం గోపాల్‌కు ఎమ్మెల్యే అయ్యే అవకాశం దక్కలేదు. బీఆర్‌ఎస్‌లో  చేరాక 2018 ఎన్నికల్లో ముషీరాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంతో సాయన్న, గోపాల్‌కు ఎంతో అనుబంధం ఉంది. హైదరాబాద్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ముఠాగోపాల్‌ మూడుసార్లు, సాయన్న ఒక పర్యాయం పనిచేశారు. సాయన్న హయాంలోనే ప్రస్తుత జిల్లా టీడీపీ కార్యాలయ నిర్మాణం జరిగింది. హుడా డైరెక్టర్‌గానూ ఆయన పని చేశారు.
చదవండి: ఆ నిబంధన వర్తించదు.. కంటోన్మెంట్‌కు ఉప ఎన్నిక లేనట్టే!

మరిన్ని వార్తలు