తెలంగాణ కాంగ్రెస్‌లో మరో తుపాన్‌..

15 Mar, 2022 01:30 IST|Sakshi

రేవంత్‌ ‘వన్‌ మ్యాన్‌ షో’ చేస్తున్నారంటున్న సీనియర్లు

ఆయనను కట్టడి చేయాలంటూ అధిష్టానాన్ని కోరాలని నిర్ణయం 

త్వరలో ఢిల్లీకి రేవంత్‌ వ్యతిరేక వర్గం

‘పాదయాత్ర’ ప్రకటనతో ఆగ్రహం! 

మర్రి శశిధర్‌రెడ్డి ఇంట్లో భేటీ 

కాంగ్రెస్‌ విధేయుల ఫోరం పేరుతో సమావేశం

శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, వీహెచ్, పొన్నాల, గీతారెడ్డి హాజరు 

మూడు గంటలకుపైగా భేటీ.. రాష్ట్ర పార్టీలో పరిణామాలపై చర్చ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో మరో తుపాన్‌  మొదలైంది. నేతల అసమ్మతి మరోమారు బయటపడింది. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై చర్చించేందుకు పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు సోమవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ విధేయుల ఫోరం పేరుతో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డిలతోపాటు సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు కోదండరెడ్డి, గోపిశెట్టి నిరంజన్, కమలాకర్‌రావు, శ్యాంమోహన్‌ తదితరులు హాజరయ్యారు. దాదాపు 3 గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలు, రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తు గురించి వారు చర్చించినట్టు తెలిసింది.

ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి పనితీరు పార్టీ ఐక్యతను దెబ్బతీసేలా ఉందని నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం. రేవంత్‌ ఏకపక్ష నిర్ణయాలు, ప్రకటనలతో పార్టీలోని సీనియర్లతోపాటు ముఖ్యనేతలందరినీ అవమానపరిచే తరహాలో వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు ఈ సమావేశంలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రేవంత్‌ వన్‌మ్యాన్‌ షోను కట్టడి చేయాలని కోరుతూ ‘కాంగ్రెస్‌ పార్టీని కాపాడుకుందాం’ పేరిట.. త్వరలోనే నేతలందరూ ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. రేవంత్‌ను కట్టడి చేయాలని అధిష్టానం పెద్దలను కోరాలని భావిస్తున్నట్టు తెలిసింది. 
 
పార్టీ బలోపేతం కోసమే..: శ్రీధర్‌బాబు 
మర్రి శశిధర్‌రెడ్డి నివాసం నుంచి నేతలు బయటికి వచ్చిన సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి తన నివాసానికి వచ్చి వెళ్లాలని సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆహ్వానించారని చెప్పారు. తమ భేటీలో ప్రత్యేకత ఏమీ లేదని, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించామని చెప్పారు. అయితే తమ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం చర్చ జరిగిందని శ్రీధర్‌బాబు పేర్కొనడం గమనార్హం. కాగా పార్టీలో పరిణామాలు, సీనియర్ల విషయంలో జరుగుతున్న అవమానాలపై చర్చించామని మాజీ ఎంపీ వీహెచ్‌ తెలిపారు. అన్ని విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. 

పార్టీకి పూర్వవైభవం రావాలి: మర్రి శశిధర్‌రెడ్డి 
కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులు జరగాలని పార్టీ వర్కింగ్‌ కమిటీ సోనియా గాంధీని కోరిందని.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏవిధంగా ప్రజల విశ్వాసం పొందుతుందనే దానిపై నిర్ణయాలు ఉండాలని సూచించిందని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోనూ పార్టీకి పూర్వ వైభవం రావాలన్నారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్నవారు పార్టీకి అనుబంధంగా ఉన్నారా లేదా అనేది చూడాలని.. దీనిపై తాము చర్చించామని వెల్లడించారు. 

అన్నీ మీడియాకు చెప్పలేం: జగ్గారెడ్డి 
ఆదివారం ఢిల్లీలో సోనియా గాంధీ సమావేశం ఏర్పాటు చేసిన అంశంపై చర్చించామని.. బయట జరుగుతున్న ఊహాగానాలు సరికాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. పార్టీతో కొన్ని సంవత్సరాలుగా అనుబంధం కొనసాగుతున్న నేతలం కలిసి మాట్లాడుకున్నామని.. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం ఉండాలని కోరుకున్నామని తెలిపారు. వీహెచ్‌ చెప్పిన అంశాలు చర్చకు వచ్చాయని, కానీ అవన్నీ మీడియాకు చెప్పలేనని పేర్కొన్నారు. కాంగ్రెస్కు రెట్టింపు బలం కోసం ఏ విధంగా పనిచేయాలనే దానిపై చర్చించామన్నారు. 

రేవంత్‌ ‘పాదయాత్ర’ ప్రకటనతో మళ్లీ దుమారం 
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదివారం కొల్లాపూర్‌లో జరిగిన సభలో.. తాను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు, 33 జిల్లాల్లో తిరుగుతానని, పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుంటానని ప్రకటించడం రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాల్లో దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని పార్టీ ముఖ్య నాయకులతో చర్చించకుండా, అటు టీపీసీసీ కార్యవర్గంలోగానీ, రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోగానీ మాట్లాడకుండా, అధిష్టానానికి చెప్పి అనుమతి తీసుకోకుండా రేవంత్‌ ఈ ప్రకటన చేశారని.. ఇది ఇతర నేతలను అవమానించడమేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోమవారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల భేటీకి కూడా ఈ ప్రకటనే కారణమని అంటున్నారు. 

భట్టి కూడా చేస్తున్నా.. 
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పేరుతో మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఆయన కూడా పార్టీలో ఎలాంటి చర్చ లేకుండా పాదయాత్ర చేపట్టారని.. అయితే ఎమ్మెల్యే హోదాలో తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై యాత్రలు చేయడంలో ఎలాంటి తప్పు లేదని కొందరు నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు భట్టి పాదయాత్ర చేస్తుంటే లేనిది రేవంత్‌ చేస్తే తప్పేంటని మరికొందరు వాదిస్తున్నారు. 

‘పాదయాత్ర’లకు పోటీ 
వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలనే ఆలోచన కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పట్నుంచో ఉంది. అదే సమయంలో యాత్రకు నాయకత్వం వహించేందుకు పోటీ పడుతున్న నేతల జాబితా కూడా చాంతాడంత ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానంతో చర్చించి పాదయాత్ర చేసే నేతల పేర్లను ప్రకటించాకే రాష్ట్రవ్యాప్త యాత్ర చేపట్టాలనే అభిప్రాయం పార్టీవర్గాల్లో ఉంది. అందులో భాగంగానే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ముందు జరిగిన సీఎల్పీ సమావేశంలో పాదయాత్ర అంశంపై చర్చించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌చార్జుల అభిప్రాయం సేకరించాలని భావించినా.. సమయాభావం వల్ల సాధ్యం కాలేదని తెలిసింది.

ఇలాంటి సమయంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‘సర్వోదయ పాదయాత్ర’ప్రారంభం కావడం, తెలంగాణలో 26 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో ఏదో ఒక రోజు రాహుల్‌గాంధీ పాల్గొంటారన్న అంశం కీలకంగా మారింది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వంతో రాహుల్‌ సమావేశమై.. పాదయాత్ర చేసేవారిని ఫైనల్‌ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇవేమీ జరగకుండానే రేవంత్‌రెడ్డి కొల్లాపూర్‌ సభలో పాదయాత్ర ప్రకటన చేయడం కాంగ్రెస్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో తెలియడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.   

మరిన్ని వార్తలు