డబ్బు పంపకాల్లో గొడవతోనే ఉపఎన్నిక! 

4 Nov, 2021 01:13 IST|Sakshi
 షబ్బీర్‌ అలీ, మధుయాష్కీ  

హుజూరాబాద్‌ ఫలితాలపై సమీక్షిస్తాం: షబ్బీర్‌ అలీ 

జనజాగరణ యాత్రలో భాగంగా రోజూ ఏడు కిలోమీటర్ల పాదయాత్ర 

బీజేపీతో కాంగ్రెస్‌కు ఎప్పటికీ పొత్తు కలవదు: మధుయాష్కీ 

బీజేపీ, టీఆర్‌ఎస్‌ క్షుద్ర రాజకీయాలు: దాసోజు శ్రవణ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నిక పార్టీల పంచాయతీ కాదని.. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవతోనే ఆ ఎన్నిక జరిగిందని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ వ్యాఖ్యానించారు. సీఎం సీటు, డబ్బు పంపకాల్లో వచ్చిన విభేదాల కారణంగానే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశం అనంతరం మధుయాష్కీగౌడ్, దాసోజు శ్రవణ్, మహేశ్‌కుమార్‌గౌడ్, మల్లు రవితో కలసి షబ్బీర్‌ అలీ మీడియాతో మాట్లాడారు.

హుజూరాబాద్‌ ఎన్నికలో కాంగ్రెస్‌ పరాజయంపై పీఏసీ సమావేశంలో చర్చించామని చెప్పారు. ఓట్లెందుకు తగ్గాయి? అభ్యర్థి ఎంపికలో జాప్యం ఎందుకు జరిగిందనే అంశాలపై చర్చించామని.. ఓటమిపై సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇక నవంబర్‌ 14 నుంచి 21 వరకు నిర్వహించనున్న జనజాగరణ యాత్రలో ప్రతి జిల్లాలోని నాయకత్వం స్థానికంగా పాల్గొంటుందని.. రోజుకు 7 కిలోమీటర్ల యాత్ర కొనసాగుతుందని తెలిపారు. సభ్యత్వ నమోదు, జనజాగరణ యాత్ర నిర్వహణ కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కో–ఆర్డినేటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. సభ్యత్వ నమోదుకు సంబంధించి ఈ నెల 9, 10 తేదీల్లో మండల, జిల్లా, డివిజన్‌ అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. 

బీజేపీతో అంటకాగేది ప్రాంతీయ పార్టీలే.. 
హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయన్న టీఆర్‌ఎస్‌ ఆరోపణలు సరికాదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ స్పష్టం చేశారు. గాడ్సేవాదంతో నడిచే బీజేపీతో గాంధేయ పార్టీ అయిన కాంగ్రెస్‌ ఎప్పటికీ కలవదన్నారు. దేశంలో రాజకీయ పరిస్థితులను గమనిస్తే.. ప్రాంతీయ పార్టీలే బీజేపీ, అమిత్‌షా, మోదీలతో అంటకాగుతున్నాయని, టీఆర్‌ఎస్‌ కూడా బీజేపీకి మడుగులొత్తుతోందని విమర్శించారు. 

తెలంగాణను ఎటు తీసుకెళ్తున్నారు? 
పేదోళ్ల రక్తతర్పణంతో వచ్చిన తెలంగాణను రాజకీయ వ్యాపార ప్రయోగశాలగా మార్చారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం పేరుతో బీజేపీ అభ్యర్థి రాజేం దర్‌ రూ.500 కోట్లు, అహంకారంతో టీఆర్‌ఎస్‌ నేతలు రూ.5,500 కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించారు. డబ్బుల కోసం ఓటర్లు ధర్నాలు చేసే పరిస్థితిని సృష్టించాయని మండిపడ్డారు. టీఆర్‌ఎస్, బీజేపీలుక్షుద్ర రాజకీయాలతో తెలంగాణను ఎటు తీసుకెళుతున్నాయో మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు అర్థం చేసుకోవాలన్నారు.  

మరిన్ని వార్తలు