బీఆర్‌ఎస్‌తో పొత్తుపై ఇప్పుడే చెప్పలేం

8 Feb, 2023 03:24 IST|Sakshi

త్వరలో సీపీఐతో పొత్తులపై చర్చిస్తాం: తమ్మినేని   

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలప్పుడే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. కానీ బీఆర్‌ఎస్‌ నాయకులు సీపీఐ, సీపీఎం పార్టీలు తమతోనే ఉంటాయనీ, ఎమ్మెల్యే సీట్లు కాకుండా, ఒకటి లేదా రెండు ఎమ్మెల్సీలు కేటాయిస్తామంటూ ప్రకటిస్తున్నారని గుర్తు చేశారు. ఇది బీఆర్‌ఎస్‌ అధిష్టానానికి తెలిసే జరుగుతుందని తాము అనుకోవడం లేదన్నారు.

గతంలో పొత్తులు ఖరారైనపుడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వని దాఖలాలు ఎప్పుడూ లేవని వివరించారు. త్వరలోనే సీపీఐతో పొత్తులపై చర్చిస్తామన్నారు. హైదరాబాద్‌లో రెండ్రోజులపాటు జరిగే సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు ఎ.విజయరాఘవన్, బీవీ రాఘవులుసహా తమ్మినేని వీరభద్రం విలేకరులతో మాట్లాడారు. తమ్మినేని మాట్లాడుతూ, బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తామని చెప్పారు. మార్చిలో రాష్ట్రస్థాయిలో ప్రతి మండలంలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణను ప్రకటిస్తామని వివరించారు. 

బట్టబయలు కావాల్సిందే: రాఘవులు 
అదానీ పెట్టుబడులు, షేర్ల పతనానికి సంబంధించిన అక్రమాల గురించి ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయనీ, చర్చ చేపట్టాల్సిందేనంటూ రెండురోజులుగా పార్లమెంటును స్తంభింపజేశాయని బీవీ రాఘవులు చెప్పారు. కానీ కేంద్రం మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. అదానీ వ్యవహారంపై ప్రతిపక్షాలు పట్టుబడుతున్నట్టుగా జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాల్సిందేనని కోరారు.   

మరిన్ని వార్తలు