బీజేపీలో చేరనున్న తీన్మార్‌ మల్లన్న 

6 Dec, 2021 02:35 IST|Sakshi

వెల్లడించిన తీన్మార్‌ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ

పంజగుట్ట (హైదరాబాద్‌): తీన్మార్‌ మల్లన్న క్షేమంగా ఉంటూ, తెలంగాణ ప్రజలకు సేవచేయాలంటే ఆయన బీజేపీలో చేరడమే ఉత్తమమని నిర్ణయించినట్లు మల్లన్న టీం రాష్ట్ర కమిటీ తెలిపింది. ఆయన బీజేపీలో చేరినా మల్లన్న టీం ఇండిపెండెంట్‌గా ఉన్నప్పుడు ప్రజలకు ఎలా సేవ చేసిందో అలానే చేస్తామంది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తీన్మార్‌ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ నాయకుడు రజనీకాంత్, క్రమశిక్షణా సంఘం చైర్మన్‌ నాగయ్య, మీర్‌పేట కార్పొరేటర్‌ ఎడ్ల మల్లేశ్‌ ముదిరాజ్, ఈశ్వరి విలేకరులతో మాట్లాడారు.

మల్లన్న రాష్ట్రవ్యాప్తంగా 6 వేల కిలోమీటర్ల పాదయాత్ర కార్యాచరణ సిద్ధం చేసుకోగానే రాష్ట్రప్రభు త్వం అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. ‘మల్లన్న జైలుకు వెళ్లే సమయంలో 20 కేసులుండగా జైలుకు వెళ్లాక మరో 18 అక్రమ కేసులు పెట్టారు. అక్రమంగా 73 రోజులు జైలులో ఉంచారు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం ఆయనపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని, ఈ సమయంలో ఆయన బీజేపీలో ఉండటమే సరైందని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ విషయాన్ని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తెలియజేశామని, త్వరలో వారు నిర్ణయించిన తేదీలో బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. జైలులో ఉన్నప్పుడు తనకు సహకరించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను రెండు, మూడ్రోజుల్లో మల్లన్న కలవనున్నారు.  

మరిన్ని వార్తలు