Etela: కౌశిక్‌రెడ్డి తీరుతో ఇరకాటంలో కాంగ్రెస్‌

13 May, 2021 10:42 IST|Sakshi

ఈటల వ్యవహారంలో కాంగ్రెస్‌ విచిత్ర పరిస్థితి

ఈటలకు కాంగ్రెస్‌ బడా నేతల మద్దతు

హుజూరాబాద్‌లో పార్టీ ఇన్‌చార్జి కౌశిక్‌ భిన్నవైఖరి

ఈటల కబ్జాల పేరిట చిట్టా విప్పుతున్న కౌశిక్‌

ఈటల వ్యవహారాలపై ఘాటు విమర్శలు

కౌశిక్‌ రెడ్డి తీరును జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్‌

టీఆర్‌ఎస్‌ కోవర్టుగా ఆరోపణలు

ఉప ఎన్నిక వస్తే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కౌశిక్‌?

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటోంది. మంత్రివర్గం నుంచి అవమానకర రీతిలో బర్తరఫ్‌నకు గురైన ఈటల రాజేందర్‌కు కాంగ్రెస్‌ బడా నేతలు మద్దతుగా నిలుస్తుంటే.. స్థానికంగా అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావును ఎదుర్కొనే విషయంలో ఈటలకు ఇప్పటికే కాంగ్రెస్‌ నేతల నుంచి మద్దతు లభించింది. కానీ.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పాడి కౌశిక్‌ రెడ్డి మాత్రం ఈటలను తూర్పార పట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన తరువాత ఈటలకు వ్యతిరేకంగా భూ కుంభకోణాల పేరుతో హల్‌చల్‌ చేస్తున్న నాయకుడు కౌశిక్‌రెడ్డి ఒక్కరే. ఈటలను భూకబ్జాదారుడిగా, వేల కోట్ల అధిపతిగా చూపించేందుకు కౌశిక్‌ రెడ్డి మీడియా సమావేశాలు, టీవీ లైవ్‌షోల్లో పాల్గొంటుండడం కాంగ్రెస్‌ నాయకులకు మింగుడు పడడం లేదు. ఈ పరిస్థితిపై ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో కేసీఆర్‌ను వ్యతిరేకించే కాంగ్రెస్‌ పెద్ద నేతలు తల పట్టుకొంటున్నారు.

శత్రువుకు శత్రువు మిత్రుడు..
మెదక్‌ జిల్లా అసైన్డ్‌ భూములు, దేవరయాంజిల్‌ దేవాలయ భూముల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పెద్దలు ఈటలపై అస్త్రాలు సంధించారు. మంత్రివర్గం నుంచి తొలగించారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్‌లోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈటలకు మద్దతుగా నిలిచింది. జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌ నేత టి.జీవన్‌రెడ్డితోపాటు ఎంపీలు ఎ.రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర నాయకులు వి.హన్మంతరావు, దాసోజు శ్రవణ్‌ తదితరులు ఈటలకు మద్దతుగా తమ వాణి వినిపించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కేసీఆర్‌ను వ్యతిరేకించే విపక్ష నేతల మద్దతు కోసం ఈటల కూడా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం సీఎల్‌పీ నాయకుడు భట్టి విక్రమార్కను కలిశారు. ఈటల పోరాటానికి ఆయన సంఘీభావం తెలిపారు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత కోల్పోయిన వారు, బీజేపీ నాయకులతోపాటు మరికొందరు కాంగ్రెస్‌ నేతలను కలిసి మద్దతు కోరే ప్రయత్నాల్లో ఈటల ఉన్నారు. ఉమ్మడి శత్రువు టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టేందుకు ఈటలకు అండగా నిలుస్తామని కాంగ్రెస్‌ నేతలు చెపుతున్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కలిసొచ్చే ప్రతీ అస్త్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ వినియోగించుకుంటుందని, హుజూరాబాద్‌లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నామని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ ‘సాక్షి’కి చెప్పారు. బలమైన శత్రువును ఎదుర్కొనే క్రమంలో మిగతా వారంతా ఒక్కటవడం కొత్త కాదని ఆయన అన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. హుజూరాబాద్‌ కేంద్రంగా కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు ఆపార్టీ పెద్దలకు అర్థం కావడం లేదు.

టీఆర్‌ఎస్‌కు అస్త్రంగా మారిన కౌశిక్‌ తీరు
భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత టీఆర్‌ఎస్‌కు చెందిన జిల్లా మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌ హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈటలపై విమర్శలు గుప్పించారు. సాంకేతికంగా ఈటల ఇప్పటికీ టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతుండడంతో ఆ పార్టీ నేతలెవరూ ఆయనపై విమర్శలు చేయడం లేదు. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ నేతల నుంచి ఈటలకు మద్దతు లభిస్తోంది. ఈ పరిస్థితుల్లో హుజూరాబాద్‌లో ఓడిపోయిన కౌశిక్‌రెడ్డి ఈటలపై చేస్తున్న విమర్శలే ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు బలాని్నస్తున్నాయి. మరోవైపు కౌశిక్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీని ఒక్క మాట అనకుండా ఈటలనే విమర్శించడాన్ని స్థానిక కాంగ్రెస్‌ నాయకులు కూడా జీర్ణించుకోలేదు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నేరెళ్ల మహేందర్‌ గౌడ్‌ ఇటీవల కరీంనగర్‌లో మీడియా సమావేశం ఏర్పాటుచేసి కౌశిక్‌రెడ్డి తీరును విమర్శించారు.

కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ ముఖ్య నాయకుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ మౌత్‌పీస్‌గా కౌశిక్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళుతున్నట్లు చెప్పారు. ప్రగతిభవన్‌ వాయిస్‌ను కౌశిక్‌ రెడ్డి వినిపిస్తున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో ‘పాడి కౌశిక్‌రెడ్డి అన్న టీం’ పేరిట ‘ఈటల కోవర్టులు’గా కాంగ్రెస్‌ నాయకులను పేర్కొంటూ కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు దర్శనమిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్, వీహెచ్‌లు ఈటల అవినీతి గురించి ప్రశ్నించకుండా ఎందుకు మద్దతిస్తున్నారని పేర్కొనడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాంగ్రెస్‌ పార్టీలోని మితివీురిన అంతర్గత ప్రజాస్వామ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఈటలను తూర్పార పడుతున్న కౌశిక్‌ రెడ్డి
2018 ఎన్నికల్లో హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పాడి కౌశిక్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి దగ్గరి బంధువు. ఈటల ఎపిసోడ్‌ వెలుగులోకి వచ్చిన తరువాత పార్టీ పెద్ద నేతలంతా మాజీ మంత్రికి మద్దతుగా నిలవగా.. కౌశిక్‌ రెడ్డి మాత్రం ఘాటైన విమర్శలతో తెరపైకి వచ్చారు. ఈటల మంత్రిగా బర్తరఫ్‌ అయిన తరువాత మేడ్చల్‌ మండలం రావల్‌కోల్‌లో ఈటల కొడుకు నితిన్‌రెడ్డి 31 ఎకరాల భూముల కొనుగోలు, ఈటల బినామీగా సాదా కేశవరెడ్డిని పేర్కొంటూ ఆయన కొనుగోలు చేసిన 36 ఎకరాల గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

‘ఈటల రాజేందర్‌ రెడ్డి’గా రావల్‌కోల్‌ భూమి పట్టా పాస్‌పుస్తకంపై ఉన్న పేరును ప్రస్తావిస్తూ, బీసీ నాయకుడిగా ఆయనకున్న పేరును చెరిపేసే ప్రయత్నం చేశారు. తాజాగా మంగళవారం మీడియా సమావేశంలో ఈటలకు రూ.600 కోట్ల విలువైన 700 ఎకరాల భూములున్నాయని, వాటిపై విచారణ జరపాలని సీఎంను కోరారు. సీలింగ్‌ చట్టాన్ని అతిక్రమించిన ఈటల నుంచి భూములను స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై బుధవారం ఓ టీవీ ఛానెల్‌ జరిపిన డిబేట్‌లో మాట్లాడుతూ ఈటలను భూకబ్జాదారుడిగా పేర్కొన్నారు. ఈ పరిణామాలను కాంగ్రెస్‌ పార్టీ జీర్ణించుకోలేక పోతోంది.

చదవండి: అన్నాడీఎంకేకు మరో షాక్‌: చేజారనున్న ‘పెద్దరికం’
చదవండి: టీచర్‌ నుంచి స్పీకర్‌గా ఎదిగిన అపావు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు