బీజేపీకి వ్యతిరేకమని ఒట్టేసి చెప్పండి

22 Aug, 2022 03:15 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి. చిత్రంలో మధుయాష్కీగౌడ్, అంజన్‌కుమార్‌ యాదవ్‌ 

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌ 

మునుగోడు సభతో ఒరిగిందేమీ లేదు 

ఏకలింగం బీజేపీని మూడు తోకలు చేసింది కేసీఆరే 

సాక్షి, హైదరాబాద్‌:  బీజేపీకి తాను నిజంగా వ్యతిరేకమని సీఎం కేసీఆర్‌ యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి మీద ఒట్టేసి చెప్పాలని టీపీసీసీ అధ్యక్షు­డు ఎ.రేవంత్‌రెడ్డి సవాల్‌ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే మళ్లీ బీజేపీకే మద్దతు ఇస్తారని చెప్పారు. ఇప్పటివరకు ఎంఐఎం వయా టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీకి మద్దతు అందుతోంటే, ఇప్పుడు సీపీఐ వయా టీఆర్‌ఎస్‌ నుంచి ఆ పార్టీకి మద్దతు ఇచ్చేలా చేస్తున్నారని విమర్శించారు.

ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, యువజన కాంగ్రెస్‌ నేత అనిల్‌కుమార్‌ యాదవ్‌లతో కలిసి ఆయన మాట్లాడారు.  

మళ్లీ వంచించే ప్రయత్నం 
మునుగోడులో కేసీఆర్‌ సభతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. సభలో ఆ నియోజకవర్గానికి ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పకుండా జాతీయ రాజకీయాలు మాట్లాడి కేసీఆర్‌ మళ్లీ వంచించే ప్రయత్నమే చేశారని విమర్శించారు. డిండి ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో, ఎస్సెల్బీసీని ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదో, పోడు భూముల సమస్యలను ఎలా తీరుస్తారో, చర్లగూడెం, కిష్టరాంపల్లి భూనిర్వాసితుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పలేదని అన్నారు. ఇవన్నీ చెప్పకుండా ఈడీ, సీబీఐల గురించి మాట్లాడితే ఏం లాభమని నిలదీశారు.   

పార్టీ ఫిరాయింపులకు కేసీఆరే ఆద్యుడు 
పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరేనని, ఏకలింగంగా ఉన్న బీజేపీని మూడు తోకలుగా చేసింది ఆయనేనని రేవంత్‌ అన్నారు. లేని బీజేపీని ప్రత్యా మ్నాయంగా సృష్టించిందీ, తెలంగాణపై బీజేపీ ముప్పేట దాడికి కారణమైంది కూడా కేసీఆరేనని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారని గతంలో ప్రశ్నించిన ఆయన, ఇప్పుడు అదే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

కమ్యూనిస్టులు కేసీఆర్‌ ఉచ్చులో ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. వారి నిర్ణయం తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని పేర్కొన్నారు. మునుగోడులోని కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. మధుయాష్కీ మాట్లాడుతూ.. మునుగోడు సభలో కాంగ్రెస్‌ పార్టీనుద్దేశించి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్‌ ఎక్కడ ఉండేవారో ఆలోచించుకోవాలని, ఆయన భాషను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని అన్నారు.

మరిన్ని వార్తలు