భట్టిని ఓర్వలేకనే ఎమ్మెల్యేలను కొన్న కేసీఆర్‌! 

18 Dec, 2022 02:26 IST|Sakshi
గాంధీభవన్‌లో శనివారం జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో కేక్‌ కట్‌ చేస్తున్న రేవంత్‌ రెడ్డి 

దళిత నేతకు సీఎల్పీ హోదా ఉండొద్దని అలా చేశారు: రేవంత్‌ 

దళితులను సీఎంలు, కేంద్ర మంత్రులు చేసిన ఘనత కాంగ్రెస్‌ది 

గాంధీభవన్‌లో జరిగిన క్రిస్‌మస్‌ వేడుకల్లో టీపీసీసీ చీఫ్‌ వ్యాఖ్య 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో దళిత వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా ఎన్నుకుంటే సీఎం కేసీఆర్‌ ఓర్వలేకపోయారని.. భట్టికి సీఎల్పీ నేత హోదా ఉండకుండా చేసేందుకే 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొన్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశంలో దళితులకు సీఎంలుగా, కేంద్ర మంత్రులుగా కాంగ్రెస్‌ పార్టీ అవకాశం కల్పించిందని చెప్పారు.

దళితుడిని అధ్యక్షుడిని చేసే దమ్ము దేశంలోని ఏపార్టీకి ఉందని ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేను ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ఘనత కాంగ్రెస్‌ పార్టీదన్నారు. శనివారం గాంధీభవన్‌ ఆవరణలో దళిత కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో క్రిస్‌మస్‌ వేడుకలు జరిగాయి. రేవంత్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దళితులపై కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ప్రేమ, అభిమానానికి మల్లికార్జున ఖర్గేనే ఉదాహరణ అని చెప్పారు. 

దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఇస్తాం 
కాంగ్రెస్‌ పార్టీ పేదలకు భూములు పంచితే బీఆర్‌ఎస్‌ వాటిని గుంజుకుంటోందని.. బీజేపీ దీన్ని చోద్యం చూస్తోందని రేవంత్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దళిత క్రిస్టియన్లకు కచ్చితంగా రిజర్వేషన్లు కల్పిస్తామని.. ప్రతీ మండలంలో ఒక క్రిస్టియన్‌ çశ్మశానవాటికను ఏర్పాటు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల కోసమే రాహుల్‌ పాదయాత్ర సాగిస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌కు వేసే ఓటు పరోక్షంగా మోదీకే చేరుతుందని.. బీఆర్‌ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నేతలు మహేశ్‌కుమార్‌గౌడ్, చిన్నారెడ్డి, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు