ఎమ్మెల్సీ ఎన్నికలపై నేడు కాంగ్రెస్‌ నిర్ణయం 

16 Nov, 2021 01:25 IST|Sakshi

బలాబలాలు అంచనా వేయాలన్న రేవంత్‌ 

స్థానిక నాయకత్వాల అభిప్రాయాల మేరకు తుది నిర్ణయం 

ఉధృతంగా సభ్యత్వ నమోదుపై దృష్టి 

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం నిర్ణయం తీసుకోనుంది. వచ్చే నెలలో జరగనున్న 12 జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీకి ఉన్న బలమేంటో, ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు సమర్థులైన నేతలెవరో పరిశీలించిన తర్వాతే పోటీ చేయాలా వద్దా అనే దాన్ని అధికారికంగా ప్రకటించనుంది. ఈ మేరకు సోమవారం జూమ్‌ ద్వారా జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణ యం తీసుకున్నారు.

ఈ ఎన్నికలు జరిగే జిల్లాల్లోని నాయకులు పార్టీ బలాబలాలను అంచనా వేసి, పోటీ చేయాలా వద్దా అనే దానిపై టీపీసీసీకి నివేదిక సమర్పించా లని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు. స్థానిక నాయకత్వాల నుంచి వచ్చిన అభిప్రాయం మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని పీఏసీ నిర్ణ యించింది. ఇక, ప్రజాచైతన్య యాత్ర వాయిదా పడిన నేపథ్యంలో సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టా లని పీఏసీ సమావేశంలో నిర్ణయించారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉధృతంగా చేయాలని, ఈ కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు, సీనియర్‌ ఉపాధ్యక్షులు సమన్వయపర్చాలని, డీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదును చేపట్టాలని నిర్ణయించారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసకృష్ణన్, పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌అలీ, పీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మాజీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, కేంద్ర మాజీమంత్రులు రేణుకాచౌదరి, బలరాం నాయక్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌లు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు