వంద తరాలు తిన్నా కేసీఆర్‌కు తరగని ఆస్తి 

11 Jul, 2022 00:57 IST|Sakshi
పుస్తకాలు ఆవిష్కరిస్తున్న రేవంత్‌ రెడ్డి, మధుయాష్కి గౌడ్‌ తదితరులు 

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్, వక్తలు ధ్వజం 

నిజమైన ఉద్యమకారులు ఆస్తులు కూడబెట్టుకోరు

పంజగుట్ట: తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ పాత్ర నిజం లాంటి అబద్ధమని, ఉద్యమం ముసుగులో ఆయన తన పార్టీని విస్తరించుకుని ఆర్థికంగా వంద తరాలు తిన్నా తరగని ఆస్తిని సంపాదించుకున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 2001లో టీఆర్‌ఎస్‌ స్థాపించినప్పుడు కేసీఆర్‌ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత అనే విషయాలను ప్రజలకు వివరించాలని, అప్పుడే ఉద్యమకారులెవరో, ద్రోహులెవరో తెలిసిపోతుందన్నారు.

నిజమైన ఉద్యమకారులెవరూ ఆస్తులను కూడబెట్టుకోరన్నారు. ఆదివారం ఇక్కడి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(టీజేఎసీ) ఆధ్వర్యంలో టీజేఎసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఇటిక్యాల పురుషోత్తం రచించిన దాలి, చేదునిజం పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దాలి పుస్తకాన్ని రేవంత్‌ ఆవిష్కరించగా, చేదునిజం పుస్తకాన్ని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కిగౌడ్‌ ఆవిష్కరించారు.

కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్‌ పసునూరి రవీందర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్‌ మాట్లాడారు. నిజమైన ఉద్యమకారుల చరిత్ర బయటకు రాకుండా, చావు అంచులదాకా వెళ్లి తెలంగాణ తెచ్చానని వక్రీకరించిన చరిత్రను ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది కవులు, కళాకారులు స్ఫూర్తిని ఇచ్చారని, ప్రస్తుతం కవులు, కళాకారులు గడీల్లో బందీగా ఉన్నారని, ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదని రేవంత్‌ అన్నారు.

మేధావులతో సలహామండలి ఏర్పాటు చేస్తామని సలహామండలి అభిప్రాయాలతోనే నిర్ణయాలు తీసుకుంటామని ఎన్నికల హామీలో పెట్టారని, కానీ కుటుంబాల నిర్ణయాలే ఫైనల్‌ అవుతున్నాయని పేర్కొన్నారు.

అమరుల కుటుంబాలకు ఎప్పుడైనా భోజనం పెట్టారా..
1,200 మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో అధికారం చెలాయిస్తూ నాలుగు పదవులు అనుభవిస్తున్న కేసీఆర్‌ కుటుంబసభ్యులు ఎప్పుడైనా అమరవీరుల కుటుంబాలకు పదవులు కట్టబెట్టారా.. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున వారికి ఒకసారైనా భోజనం పెట్టారా అని రేవంత్‌ ప్రశ్నించారు. అమరవీరుల స్తూపం నిర్మాణంలోనూ అవినీతి జరగడం సిగ్గుచేటన్నారు.

సీఎం కేసీఆర్‌ 10 వేల కోట్లు ఉన్న ఎక్సైజ్‌ శాఖ ఆదాయాన్ని రూ.36 వేల కోట్లకు పెంచుకున్నారని, తెలంగాణను తాగుబోతుల అడ్డాగా మార్చారని, గ్యాంగ్‌ రేప్‌లకు, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఏమాత్రం కేసీఆర్‌ను భరించేస్థితిలో తెలంగాణ సమాజం లేదని, కేసీఆర్‌ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు కవులు, కళాకారులు, ఉద్యమకారులు తమ కలాలకు, గళాలకు పదును పెట్టాలని పిలుపునిచ్చారు.

మధుయాష్కి గౌడ్‌ మాట్లాడుతూ శ్రీలంకలో రాజపక్స కుటుంబానికి పట్టిన గతే కేసీఆర్‌ కుటుంబానికి పడుతుందని హెచ్చరించారు. తెలంగాణ వచ్చాక కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్‌ కాటేసే నక్క అని అప్పుడెవ్వరూ గ్రహించలేకపోయారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు,  పాత్రి కేయులు పాశం యాదగిరి, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ సి.కాశీం, కవి, గాయకుడు వరంగల్‌ రవి, రచయిత వేముల ఎల్లన్న  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు