ఇక శివారులో శిబిరాలు

8 Dec, 2021 02:02 IST|Sakshi

ఇతర రాష్ట్రాల్లో టీఆర్‌ఎస్‌ క్యాంపులు క్లోజ్‌ 

నగరానికి చేరుకుంటున్న ‘స్థానిక’ ఓటర్లు 

నేడు, రేపు జిల్లాల వారీగా కేటీఆర్‌ సమావేశాలు 

10న జరిగే పోలింగ్‌పై దిశానిర్దేశం చేయనున్న మంత్రి

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎన్నిక కోసం ముందు జాగ్రత్తగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు వెళ్లిన ఓటర్లు, హైదరాబాద్‌ శివారులో జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన శిబిరాలకు చేరుకుంటున్నారు. బుధవారం రాత్రికల్లా వీరంతా తమ శిబిరాలకు చేరుకుంటారు. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు వీటిని పర్యవేక్షిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుధ, గురువారాల్లో జిల్లాల వారీగా ఓటర్లతో ఏర్పాటు చేసే సమావేశాల్లో పాల్గొని పోలింగ్‌పై అవగాహన కల్పించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేస్తారు.  

బృందాలుగా పోలింగ్‌ కేంద్రాలకు.. 
విశ్వసనీయ సమాచారం మేరకు.. ఈ నెల 10న పోలింగ్‌ జరిగే ఆరు స్థానిక కోటా స్థానాలకు సంబంధించిన ఓటర్లను బృందాలుగా సంబంధిత జిల్లాల్లోని పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తారు. మెదక్, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థులు, నల్లగొండ, ఆదిలాబాద్‌తో పాటు కరీంనగర్‌ జిల్లాలోని రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండటంతో టీఆర్‌ఎస్‌ తమ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా పోలింగ్‌ జరిగేలా జాగ్రత్తలూ తీసుకుంటోంది.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండు స్థానాలు ఉండటంతో ఏ ఒక్క స్థానం చేజారకుండా చూసేందుకు ఇక్కడి ఓటర్లను బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలించిన విషయం తెలిసిందే. సుమారు వారం రోజులుగా ఈ క్యాంపు లో ఉన్న ఓటర్లు.. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌ నేతృత్వంలో మంగళవారం తిరుమల దర్శనం అనంతరం హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టారు.

బుధవారం ఉదయం శామీర్‌పేటలోని తమ బసకు చేరుకున్న అనంతరం ఓటర్లుగా ఉన్న పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో కేటీఆర్‌ భేటీ అవుతారు. మెదక్‌ జిల్లాకు చెందిన ఓటర్లను ఢిల్లీలోని శిబిరానికి తరలించగా, వారు ఆగ్రా, జైపూర్‌ పర్యటన ముగిం చుకుని బుధవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

గోవా శిబిరంలో ఉన్న ఖమ్మం జిల్లా ఓటర్లు కూడా మంత్రి పువ్వాడ అజయ్‌ నేతృత్వంలో బృందాలుగా బుధవారం ఉదయానికి హైదరాబాద్‌కు చేరుకుంటారు. నల్లగొండ, ఆదిలాబాద్‌ జిల్లా కు చెందిన ఓటర్లతో టీఆర్‌ఎస్‌ పార్టీ క్యాంపులు ఏర్పాటు చేయనప్పటికీ, వారిని కూడా బుధవారం హైదరాబాద్‌కు తరలించాలని సంబంధిత జిల్లా మంత్రులకు ఆదేశాలు వెళ్లాయి.   

మరిన్ని వార్తలు