గెలుపు సులువే.. అటు ఓటూ విలువే!

30 Nov, 2021 04:02 IST|Sakshi

మండలి ‘స్థానిక కోటా’ఎన్నికల్లో విపక్ష పార్టీ ఓట్లకు టీఆర్‌ఎస్‌ గాలం 

ప్రతి ఓటూ కీలకంగా భావిస్తున్న అధికార పార్టీ 

సొంతంగా గెలిచే అవకాశం ఉన్నా చేరికలకు ప్రోత్సాహం 

లేనిపక్షంలో ఓటు అయినా వేసేలా సంప్రదింపులు 

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలి స్థానిక సంస్థల కోటాలో ఆరు స్థానాలకు డిసెంబర్‌ 10న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఓటర్ల మద్దతు కూడగట్టడంపై టీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. ఐదు పూర్వపు జిల్లాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న ఆరు స్థానాల్లో 26 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా 5,326 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో మున్సిపల్‌ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సంఖ్యతో పోలిస్తే ఎంపీటీసీ సభ్యులు ఎక్కువగా ఉన్నారు.

కాగా ఆరు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అలాగే తొలిసారిగా ఎక్స్‌ అఫిషియో సభ్యుల హోదాలో.. ఎన్నికలు జరిగే జిల్లాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఎన్నికల సంఘం స్థానిక సంస్థల కోటాలో ఓటు హక్కును కల్పించింది. దీంతో ఓటు వేయనున్న 65 మంది ఎక్స్‌ అషిషియో సభ్యుల్లోనూ మెజారిటీ ఓటర్లు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారే ఉన్నారు. 

అన్ని స్థానాలూ గెలిచే బలమున్నా.. 
అన్ని స్థానాలూ సొంతంగా గెలించేందుకు అవసరమైన బలమున్నప్పటికీ, ప్రతి ఓటునూ కీలకంగా భావిస్తున్న టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఖమ్మం, మెదక్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థులు, కరీంనగర్, ఆదిలాబాద్‌లో బీజేపీ పరోక్షంగా బలపరుస్తున్న అభ్యర్థులు పోటీలో ఉండటంతో అప్రమత్తమైంది. రెండు స్థానాలున్న కరీంనగర్‌లో అత్యధికంగా 1,324 మంది ఓటర్లు ఉండటంతో పాటు ఒకరిద్దరు బలమైన స్వతంత్రులు పోటీ చేస్తుండటాన్ని పరిగణనలోకి తీసుకుని పావులు కదుపుతోంది.

తమ పార్టీ తరఫున ఎన్నికైన ఓటర్లు ఎవరూ చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అదే సమయంలో విపక్ష పార్టీల ఓట్లనూ రాబట్టే ప్రణాళికను అమలు చేస్తోంది. మొత్తం ఓటర్లలో విపక్ష పార్టీలకు చెందిన సుమారు 30 శాతం మంది వివిధ రకాల స్థానిక సంస్థల్లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  

క్యాంపులకు తరలించేందుకు సన్నాహాలు 
విపక్ష పార్టీల నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులు చాలాచోట్ల ఇప్పటికే టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇతర పార్టీలకు చెందిన మరింతమంది కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను చేర్చుకోవడంపై, వారి మద్దతు కూడగట్టడంపై టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు దృష్టి సారించారు. నేరుగా మద్దతు ఇవ్వలేని పక్షంలో కనీసం ఓటు అయినా వేసేలా సంప్రదింపులు, సమాలోచనలు జరుగుతున్నాయి.

ఎక్కువ సంఖ్యలో ఉన్న ఎంపీటీసీ సభ్యుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఓటర్లు చేజారకుండా నిర్వహించే క్యాంపులకు పార్టీ మద్దతుదారులతో పాటు విపక్ష ఓటర్లనూ తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మెదక్, ఖమ్మంలో మినహా, మిగతా చోట్ల స్వతంత్రులే పోటీలో ఉండటంతో విపక్ష ఓట్లు రాబట్టడం అంతకష్టమేమీ కాదని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.   

మరిన్ని వార్తలు