కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి

5 Sep, 2022 04:20 IST|Sakshi
బీఎల్‌ వర్మ 

మహబూబాబాద్‌ అర్బన్‌: రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడి, బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని ఆ పార్టీ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కేంద్ర సహాయ మంత్రి బీఎల్‌ వర్మ అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా దంతాలపల్లిలోని పీహెచ్‌సీని ఆయన ఆదివారం సందర్శించారు. తొలుత కురవిలో వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం జిల్లా కేంద్రంలోని వీఆర్‌ఎన్‌ గార్డెన్‌లో లోక్‌సభ ప్రవాస్‌ యోజన కోర్‌ కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. బీజేపీ అభివృద్ధి పథకాలను తెలంగాణలో పూర్తిస్థాయిలో అమలు చేయడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ పథకం నేరుగా లబ్ధిదారులకు చేరుతోందన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రధాని ఆవాస్‌ యోజన పథకం కింద కోట్లాది మంది పేదలు ఇళ్లు నిర్మించుకుంటున్నారని తెలిపారు.

కోవిడ్‌ సమయంలో దేశంలోని ప్రజలకు వ్యాక్సిన్‌ అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారని, ఫ్రీ రేషన్‌తో పేదలందరికీ ఆహార భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి వంటివాటిని నేటికీ అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు