గంటలోగా వస్తారా, రారా?.. అరగంటలోనే హాజరైన కలెక్టర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్

26 Nov, 2021 02:12 IST|Sakshi
దిశ సమావేశంలో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి 

సమీక్షకు జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్‌ కలెక్టర్‌ గైర్హాజర్‌పై కిషన్‌రెడ్డి ఆగ్రహం

అరగంటలోనే సమావేశానికి హాజరైన కమిషనర్, కలెక్టర్‌  

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్‌ కలెక్టర్ల తీరు పట్ల కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బేగంపేట టూరిజం ప్లాజాలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశం ఏర్పాటు చేయగా, కమిటీ చైర్మన్‌గా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశానికి జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లు రాకపోవడం కేంద్ర మంత్రికి కోపం తెప్పించింది. జిల్లా సమావేశానికి కీలక అధికారులు రాకపోవడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గంట సమయం ఇచ్చి.. ఈలోగా రాకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని వారికి అల్టిమేటం పంపారు. సమావేశం ప్రారంభించిన అరగంటలోపు జీహెచ్‌ఎంసీ కమిషనర్, కలెక్టర్‌ హాజరయ్యా రు. గతంలోనూ కిషన్‌ రెడ్డికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. హైదరాబాద్‌ వరదల సమయంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కిషన్‌రెడ్డి వెంట కనీసం ఆర్డీవో స్థాయి అధికారులు కూడా హాజరుకాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మరోమారు అలాంటి అనుభవమే ఎదురుకావడంతో కిషన్‌ రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. 
చదవండి: Hyderabad: బుల్లెట్‌ బండి..పట్నం వస్తోందండీ

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి.. 
రాజకీయాలకతీతంగా పార్టీలన్నీ  హైదరాబాద్‌ నగరాభివృద్ధికి కృషి చేయాలని సమావేశంలో కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర పథకాల అమలు, లాఅండ్‌ ఆర్డర్, మహిళా సంక్షేమం, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై చర్చించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, వన్‌ నేషన్‌–వన్‌ రేషన్‌లపై సమీక్షించారు. జిల్లాకు సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు పూర్తి సమాచారంతో రావాలని ఆదేశించారు. 

>
మరిన్ని వార్తలు