దేశంకాదు.. రాష్ట్రంలో మార్పు తథ్యం!

28 May, 2022 01:15 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి 

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  

గుణాత్మక మార్పుపై చర్చకు కేసీఆర్‌ సిద్ధమా?  

ముందు సీఎంలో మార్పు రావాలి 

సీఎం చెబుతున్న సంచలనాలను ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు

సాక్షి, హైదరాబాద్‌: గత ఎనిమిదేళ్లలో దేశంతోపాటు రాష్ట్రంలో గుణాత్మక మార్పు ఎవరు తెచ్చారో తేల్చడానికి సీఎం కేసీఆర్‌ బహిరంగ చర్చకు సిద్ధం కావాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి సవాల్‌ చేశారు. 2014 నుంచి తెలంగాణలో గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం ఎంతెంత నిధులిచ్చాయో ప్రకటించాలన్నారు.

దేశంలో త్వరలోనే గుణాత్మక మార్పు వస్తుందో.. రాదో తెలియదు కానీ తెలంగాణలో మాత్రం మార్పు రావడం తథ్యమని ఆయన అన్నారు. బెంగళూరు పర్యటన సందర్భంగా సంచలన వార్త వింటారని కేసీఆర్‌ చెప్పారని, గతంలో కూడా కేసీఆర్‌ అనేక వ్యాఖ్యలు చేసినా వాటిని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు. సీఎం చెబుతున్న ప్రళయాలు, భూకంపాలకు భయ పడేవారెవరూ లేరన్నారు.

శుక్రవారం కిషన్‌రెడ్డి బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ దేశం సంగతి పక్కన పెడితే ముందుగా టీఆర్‌ఎస్‌లో, కేసీఆర్‌ వ్యవహారశైలిలో గుణాత్మక మార్పు రావాలన్నారు. గతంలో కూడా ‘ప్రళయం సృష్టిస్తా, ప్రధానిని దేశం నుంచి తరిమేస్తా, బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తా’అన్నా.. అలాంటిదేమీ జరగలేదన్నారు. తాను, ఒవైసీ కలసి దేశమంతా పర్యటిస్తామని, ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ అన్నారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. వీరిలో ఒకరు రజాకార్ల వారసుడు, మరొకరు నిజాం వారసుడు.. అని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్‌లపై రాష్ట్రం ఒక్క రూపాయి పన్ను కూడా తగ్గించలేదని.. ఇదేనా మార్పు అని ప్రశ్నించారు.  

కుటుంబ పాలనకు వ్యతిరేకం...
కేసీఆర్‌ ప్రతీసారి ప్రధాని మోదీని టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతున్నారని, రోజుకు 18 గంటలు పనిచేసే ప్రధానికి, నెలకు 18 గంటలు పని చేసే కేసీఆర్‌కు పోలికే లేదని కిషన్‌రెడ్డి చురక వేశారు. మోదీని విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. కుటుంబ పార్టీలకు, కల్వకుంట్ల కుటుంబ పాలనకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. బీజేపీ అధ్యక్షుడిని మూడేళ్లకోసారి ఎన్నుకుంటామని, ఇప్పటి అధ్యక్షుడు నడ్డా కుమారుడు తర్వాత అధ్యక్షుడు కాలేరని, ప్రధానిగా కూడా నరేంద్ర మోదీ కుటుంబం నుంచి ఉండబోరని స్పష్టంచేశారు.

‘మీ పార్టీలో ఆ పరిస్థితి ఉందా.. అంత ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. తాము తెలంగాణలో పెట్టుబడులను స్వాగతిస్తామని, అదే సమయంలో కేసీఆర్‌ కుటుంబ రాజకీయాలు వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి నిజాలు చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు. ‘కేంద్రం ఏమీ చేయనిదే తెలంగాణ ముందుకు వెళ్తోందా, తెలంగాణ ప్రజలకు వచ్చిన ఉచిత బియ్యాన్ని కూడా రాష్ట్ర సర్కార్‌ ఇవ్వడం లేదన్నది నిజం కాదా, బస్తీ దవాఖానాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు లేవా, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా, జాతీయ రహదారుల నిర్మాణం జరగడం లేదా, కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద తెలంగాణ రైతులకు డబ్బులు రావడం లేదా, రామగుండం ఎరువుల కర్మాగారం మోదీ ఇచ్చింది కాదా?’అని కిషన్‌రెడ్డి.. కేసీఆర్‌పై ప్రశ్నలు సంధించారు.

ఇంతకూ మీరు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పండని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసుకు స్థలం ఇస్తారు కానీ ట్రైబల్‌ మ్యూజియంకు మాత్రం ఇవ్వరని ఎద్దేవా చేశారు. ‘హైదరాబాద్‌ రింగ్‌ రోడ్డు టీఆర్‌ఎస్‌ వేసిందా? బీబీనగర్‌ ఎయిమ్స్‌ మెడికల్‌ కాలేజీ తెలంగాణకు ఇవ్వలేదా?’అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు సరైన సమయంలో స్పందించే సోయిలేదని, తాను రాసిన ఉత్తరాలకు జవాబు లేదని వ్యాఖ్యానించారు. ‘ఎస్సీ వర్గీకరణపై కేసు సుప్రీం కోర్టులో ఉంది.. రాష్ట్ర పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలం’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు