తొడలు కొడుతూ, భుజాలు చరుస్తూ..

28 Aug, 2021 00:41 IST|Sakshi

అసభ్య పదజాలంతో అధికార, విపక్షాల దూషణలు 

రేవంత్, మల్లారెడ్డి మాటల యుద్ధంతో తారాస్థాయికి..

వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు.. బూతు పురాణం 

తొడలు కొడుతూ, భుజాలు చరుస్తూ పరస్పర సవాళ్లు 

సోషల్‌ మీడియా పోస్టులతో మరింత ముదురుతున్న వైనం 

‘వాడు స్టేజీ ఎక్కితే జోకర్‌.. స్టేజీ దిగిన తర్వాత బ్రోకర్‌’..  మంత్రి మల్లారెడ్డిని ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు.

‘అరే సాలే.. గూట్లే.. లఫంగ.. ఇద్దరమూ పదవులకు రాజీనామా చేద్దాం’ అంటూ రేవంత్‌కు మంత్రి మల్లారెడ్డి తొడలు కొట్టి సవాల్, దూషణలు. 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార, విపక్ష నేతల నడుమ దూషణల పర్వం పరాకాష్టకు చేరుకుంది. ప్రభుత్వం, పార్టీల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నేతలు స్వయంగా తిట్ల దండ కం అందుకుంటుండటంతో.. వారి అనుచరులు మీడియా సమావేశాలు, సోషల్‌ మీడియా వేదికగా ఏకంగా బూతు పురాణం అందుకుంటున్నారు. ఓ వైపు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వాతావరణం, మరోవైపు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ క్షేత్రస్థాయిలో చేపడుతున్న సభలు, సమావేశాలు, యాత్రలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొత్త రాజకీయ శక్తులు వైఎస్‌ షర్మిల, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, తీన్మార్‌ మల్లన్న వంటి వారు కూడా ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తున్నారు.

పార్టీతో పాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై వస్తున్న ఆరోపణలు, విమర్శలను ఖండించేందుకు టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు కూడా మీడియా ముం దుకు రావడంలో పోటీపడుతున్నారు. అయితే వివిధ సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులను విమర్శించేందుకు ఆయా పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, ఉపయోగిస్తున్న భాష హద్దులు దాటి బూతులు మాట్లాడే దశకు చేరుకుంటోంది. టీఆర్‌ఎస్‌ సంస్థాగత కమిటీల ఏర్పాటు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‘ప్రజా సంగ్రామ యాత్ర’తో రాబోయే రోజుల్లో పరస్పర విమర్శలు, ఆరోపణలు తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. 

సోషల్‌ మీడియా వింగ్‌లతో పరాకాష్టకు... 
అన్ని రాజకీయ పక్షాలు తమ కార్యకలాపాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు వాట్సాప్‌ గ్రూప్‌ లు, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల మీద ప్రత్యేక ఖాతాలు తెరుస్తు న్నాయి. గ్రామస్థాయి నుంచే సోషల్‌ మీడియా కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. వార్తా పత్రికలు, టీవీ చానళ్లలో వచ్చే వార్తలు, చర్చలు, ప్రసంగాల్లో తమకు అనువైనవి, ఎదుటి వారిపై చేసే విమర్శల్లో కొన్నింటిని ఎంపిక చేసుకుని నేతల అనుచరులు, కార్యకర్తలు పోస్ట్‌ చేస్తున్నారు. వీటిపై వచ్చే కామెంట్లు కూడా చెప్పలేని రీతిలో ఉంటున్నాయి. అదే రీతిలో సమాధానం ఇవ్వకపోతే వెనకబడి పోతామనే ఉద్దేశంతో అలా స్పందించాల్సి వస్తోందని అధికార పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. ‘న్యూటన్‌ సూత్రం ప్రకారం.. చర్యకు ప్రతిచర్య తప్పదు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తోంది. విమర్శలు సంస్కారవంతంగా ఉండాలి. ఏడేండ్లుగా ఓపిక పట్టిన మా కార్యకర్తలకూ సహనం నశించింది’ అని శుక్రవారం ప్రెస్‌మీట్‌లో మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. 

వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు
పా ర్టీలు, నేతలతో సంబంధం లేకుండా ‘అరేయ్‌.. ఒరేయ్‌’అంటూ ఏకవచనంతో వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చేసే వ్యాఖ్యలు రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి ఉదంతంతో పరాకాష్టకు చేరాయి. ఇక తొడలు కొడుతూ, భుజాలు చరుస్తూ మంత్రి మల్లారెడ్డి ప్రదర్శించిన హావభావాలు, దూషణల పర్వాన్ని తర్వాతి దశకు తీసుకెళ్లాయి. ఈ ఉదంతంపై సామా జిక మాధ్యమాలు, ఇతర వేదికల మీద జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆయా పార్టీల కార్యకర్తలు, నేతల అనుచరులు, అభిమానులు చేస్తున్న వ్యాఖ్యలు, పెడుతున్న పోస్టులు మరీ దారుణంగా ఉంటున్నాయి. రాయ లేని, చెప్పలేని భాషలో ఆడ, మగ తేడా లేకుండా తిట్ల దండకం అందుకుంటున్నారు. ఇటీవలి కాలంలో రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,

మంత్రి మల్లారెడ్డి, పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, గ్యాదరి కిషోర్, మైనంపల్లి హన్మంతరావు, కాంగ్రెస్‌ నేతలు అద్దంకి దయా కర్, దాసోజు శ్రావణ్, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, నాయకుడు రాకేశ్‌రెడ్డి తదితరులు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు హద్దులు దాటాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట పడకపోతే రాబోయే రోజుల్లో విమర్శల పర్వం దాడుల పర్వానికి దారి తీసే అవకాశముందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ‘గతంలో సున్నిత అంశాల మీద సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టులు తీవ్ర విధ్వంసానికి దారితీసిన ఘటనలున్నాయి. రాజకీయ నాయకులు కూడా ఆరోపణలు, విమర్శల విషయంలో సంయమనం పాటించకపోతే భౌతిక దాడులు, ఘర్షణలకు దారి తీసే ప్రమాదం పొంచి ఉందని’ఓ సీనియర్‌ పోలీసు అధికారి ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు