17 నుంచి మళ్లీ ప్రజా ప్రస్థానం పాదయాత్ర 

1 Dec, 2021 01:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా ప్రస్థానం పాదయాత్రను ఈనెల 17 నుంచి తిరిగి ప్రారంభించేందుకు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల సమయాత్తమవుతున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో పాదయాత్రను తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 20న చేవెళ్లలో ప్రారంభించిన పాదయాత్ర 21 రోజులపాటు 238 కిలోమీటర్ల మేర సాగింది. దాదాపుగా ఆరు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని 150 గ్రామాలను షర్మిల సందర్శించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రావడంతో గత నెల 11న నల్గగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం కొండపాకగూడెంలో ఆమె పాదయాత్రకు విరామం ఇచ్చారు. మళ్లీ అక్కడి నుంచే యాత్రను కొనసాగించనున్నట్లు పాదయాత్ర కోఆర్డినేటర్‌ చంద్రహాసన్‌ రెడ్డి తెలిపారు. కోడ్‌ అనంతరం చేపట్టబోయే పాదయాత్ర ద్వారా ధాన్యం కొనుగోలుపై షర్మిల ప్రజా ఉద్యమాన్ని చేపడతారన్నారు. ముఖ్యం గా యాసంగిలో ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసేంత వరకు పోరాడతామని చెప్పారు.
 

మరిన్ని వార్తలు