ఉద్యమకారుడు.. ఎవరిని ఉద్ధరిస్తుండు?

19 Jun, 2022 03:10 IST|Sakshi
ఖమ్మం జిల్లా శంకరగిరి తండాలో  చెరకు నరుకుతున్న షర్మిల  

వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల

నేలకొండపల్లి: ఉద్యమకారుడని రెండుసార్లు నమ్మి ప్రజలు కేసీఆర్‌కు పట్టం కడితే ఆయన ఇప్పుడు ఎవరిని ఉద్ధరిస్తున్నాడో చెప్పాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్‌ చేశారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం 98వ రోజుకు చేరగా.. ఖమ్మం జిల్లా ముదిగొండ, నేలకొండపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా శంకరగిరి తండాలో చెరుకు రైతులతో మాట్లాడిన ఆమె చెరుకు కోతలు ప్రారంభించారు.

రాజేశ్వరపురం గ్రామం వద్ద యాత్ర 1,300 కిలోమీటర్లు పూర్తికాగా ఆమె వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో షర్మిల మాట్లాడుతూ ప్రజల సమస్యలను వదిలేసిన ప్రతిపక్ష పార్టీలు వేటికవే రాజకీయాలు చేస్తున్నాయని, కాంగ్రెస్‌ నేతలు కూడా  కేసీఆర్‌ పంచన చేరారని మండిపడ్డారు. ఆఖరి నిమిషం వరకు ప్రజల కోసం పోరాటం చేసిన వైఎస్సార్‌ బిడ్డగా మాట ఇస్తున్న తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. 

ఉమ్మడి జిల్లాలవారీగా వైఎస్సార్‌ టీపీ పరిశీలకులు
ఖమ్మం మయూరి సెంటర్‌: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ జిల్లాల వారీగా పరిశీలకులను నియమించింది. ఈమేరకు పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జీహెచ్‌ఎంసీ, నల్లగొండ జిల్లాలకు తూడి దేవేందర్‌రెడ్డి, మెదక్‌ జిల్లాకు ఎడమ మోహన్‌రెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్‌ జిల్లాలకు బీరెల్లి శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాలకు బండారు అంజన్‌రాజును పార్టీ పరిశీలకులుగా నియమించారు. ఖమ్మం జిల్లాకు పిట్టా రాంరెడ్డి, నిజామాబాద్‌ జిల్లాకు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాకు నాడెం శాంతికుమార్‌ను నియమించినట్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు