షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత 

14 Nov, 2022 02:15 IST|Sakshi

షర్మిల ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

ధర్మారం: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల పెద్దపల్లి జిల్లా ధర్మారంలో చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర ఆదివారం ఉద్రిక్తతల మధ్య సాగింది. మండలంలోని కొత్తూరు గ్రామానికి పాదయాత్ర చేరుకుంది. చౌరస్తాలో షర్మిల మాట్లాడుతుండగా గ్రామ సర్పంచ్‌ తాళ్ల మల్లేశం ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. కేసీఆర్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు.

దీనికి ప్రతిగా కేసీఆర్‌ డౌన్‌డౌన్‌ అని షర్మిలతోపాటు వైఎస్సార్‌టీపీ నాయకులు నినదించారు. ఈ క్రమంలోనే షర్మిల మాట్లాడుతున్న వ్యాన్‌వైపు టీఆర్‌ఎస్‌ నాయకులు దూసుకొచ్చారు. స్పందించిన షర్మిల..‘దాడులకు భయపడేదిలేదు. రండి..దమ్ముంటే దాడులు చేయండి.. దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు..’అని ప్రశ్నించారు.  పోలీసులు వారందరినీ అక్కడ్నుంచి వెనక్కి పంపించారు. ఈ సందర్భంగా చామనపల్లికి వెళ్లవద్దని షర్మిలకు పోలీసులు సూచించగా..తాను తప్పకుండా వెళ్తానని స్పష్టం చేశారు.  

చామనపల్లి మార్గంమధ్యలో అడ్డగింపు 
కొత్తూరు గ్రామం నుంచి చామనపల్లి గ్రామానికి పాదయాత్రకు వెళ్తున్న షర్మిలను గ్రామానికి వెళ్లకుండా మార్గంమధ్యలో న్యూకొత్తపల్లి వద్ద టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు రాసూరి శ్రీధర్‌ ఆధ్వర్యంలో నాయకులు రాస్తారోకో చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు టీఆర్‌ఎస్‌ నాయకులను అడ్డుతొలగించారు.  

షర్మిల తాత్కాలిక షెడ్ల తొలగింపు 
మండలంలోని కటికెనపల్లి శివారులో ఆదివారం రాత్రి బస చేసేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లను తొలగించారు. అనంతరం అదే శివారులోని మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మామిడితోట సమీపంలో తిరిగి షెడ్లను వేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..ఆడపిల్లపై దాడిచేస్తే ఆడోళ్లంటారని, ప్రశ్నిస్తే ఎదుర్కొనే దమ్ములేక దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.   

మరిన్ని వార్తలు