పంట నష్టపోతే పరిహారమేదీ?: షర్మిల 

25 Apr, 2022 03:02 IST|Sakshi
రైతుగోస ధర్నాలో షర్మిల,  పక్కన సర్పంచ్‌ తాటి సుజాత 

అశ్వాపురం: ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయి రైతులు అప్పుల పాలైతే వారికి కనీసం పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 65వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెంలో ఆదివారం రైతు గోస ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ పంటలు నష్టపోయినప్పుడు పరిహారం ఇవ్వకుండా రైతుబంధు పథకంలో రూ.5 వేలు ఇస్తే ఎలా సరిపోతాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాష్ట్రంలో పంటల బీమా పథకం ఎందుకు అమలు కావడం లేదని నిలదీశారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు అని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని షర్మిల ఆరోపించారు. ఇలా సరఫరా చేస్తే పంట ఎండిపోతుందనే ఆందోళనతో సిద్దిపేట జిల్లాలో ఓ మహిళా రైతు ఆత్మహత్య చేసుకుందని, ఆమె మరణానికి సీఎం కేసీఆరే కారణమన్నారు. ధర్నాలో వైఎస్సార్‌టీపీ నాయకులు పిట్టా రాంరెడ్డి, గడిపల్లి కవిత, టీఆర్‌ఎస్‌కు చెందిన గొల్లగూడెం సర్పంచ్‌ తాటి సుజాత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు