ఒక్క హామీ కూడా అమలు కాలేదు: షర్మిల

6 Jun, 2022 01:36 IST|Sakshi
ఖమ్మం జిల్లా అరికాయలపాడులో  ప్రజలకు అభివాదం చేస్తున్న షర్మిల 

ఏన్కూరు: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. బూటకపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్‌ను నమ్మవద్దని ఆమె పిలుపునిచ్చారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం లచ్చగూడెం, శ్రీరామగిరి, అరికాయలపాడు గ్రామాల్లో కొనసాగింది.

అరికాయలపాడులో వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం చేపట్టిన రైతుగోస ధర్నాలో ఆమె మాట్లాడుతూ..దివంగత ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్‌ పాలనలో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటే జరిగిన నష్టానికంటే ఎక్కువగా పరిహారం ఇచ్చారని, కేసీఆర్‌ పాలనలో ఎవరికీ నష్టపరిహారమే అందలేదని విమర్శించారు.

రైతు బీమా రావాలంటే 60 ఏళ్ల లోపే చనిపోవాలని మరణశాసనం రాస్తున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అని చెబుతూ బార్లు, బీర్ల తెలంగాణగా చేశారని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోందని మండిపడ్డారు. తనను ఆశీర్వదిస్తే వైఎస్సార్‌ సంక్షేమ పాలన తెస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్‌ గడిపల్లి కవిత, వైరా నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ధర్మసోత్‌ రామ్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు