డమ్మీ హామీలు.. అప్పులకుప్ప

13 Aug, 2022 03:44 IST|Sakshi
దౌల్తాబాద్‌లో మాట ముచ్చట కార్యక్రమంలో మాట్లాడుతున్న షర్మిల 

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం  

దౌల్తాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎనిమి దేళ్లలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, రాష్ట్రాన్ని మాత్రం అప్పుల ఊబిలో దించారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. గురువారం ఉదయం వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలంలోని సురాయిపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర చల్లాపూర్, ఈర్లపల్లి గ్రామాల మీదుగా కొనసాగింది. దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో గాంధీ కూడలిలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన మాట–ముచ్చట కార్యక్రమంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పెరిగిన నిత్యావసర ధరలు భారంగా మారాయని, ఫింఛన్లు, డబుల్‌ బెడ్రూమ్‌లు ఇవ్వలేదని పలువురు షర్మిల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సంద ర్భంగా షర్మిల మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా పథకాల పేరు చెప్పి కేసీఆర్‌ ఎన్నో మోసాలకు పాల్పడ్డారని, రూ.25 వేలు ఇచ్చే వ్యవసాయ పథకాలను నిలిపివేసి కేవలం రూ.5 వేల రైతుబంధుతో సరిపెడుతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ వసతిగృహాల్లో దొడ్డు బియ్యం ఇస్తున్నారని, రేషన్‌ షాపుల్లో నిత్యావసర సరుకులు ఆపేశారన్నారు. రాష్ట్రంలో ఉద్యో గాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్‌కు చీమకుట్టినట్లు కూడా లేదని ధ్వజమెత్తారు. రూ.16 లక్షల కోట్ల మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణను రూ.4 లక్షల కోట్ల అప్పులకుప్ప చేశారని అన్నారు.

రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ అధికారంలోకి రాగానే మోసం చేసిందని, విభజన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. వైఎస్సార్‌టీపీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఉద్యోగాల కల్పన మీదనే పెడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర «అధికార ప్రతినిధి పిట్టల రాంరెడ్డి, జిల్లా అధ్యక్షులు తమ్మలి బాల్‌రాజ్, మండల అధ్యక్షులు కుర్మని పకీరప్ప ఉన్నారు. 

మరిన్ని వార్తలు