కమీషన్లు వచ్చే కాళేశ్వరంపైనే శ్రద్ధ 

21 Jun, 2022 01:10 IST|Sakshi

సీఎం కేసీఆర్‌పై షర్మిల ఆగ్రహం

కోదాడ: నల్లగొండ జిల్లా అంటే వైఎస్సార్‌కు ప్రత్యేక అభిమానం ఉండేదని, ముఖ్యమంత్రి హోదాలో 33 సార్లు జిల్లాకు వచ్చారని వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గుర్తు చేశారు. జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్‌ నుంచి విముక్తి కల్పించడానికి వైఎస్సార్‌ ప్రారంభించిన ఎస్‌ఎల్‌బీసీకి ఆ తర్వాత పాలకులు ఒక్కపైసా ఇవ్వలేదని విమర్శించారు. వేల కోట్ల కమీషన్‌ వస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై మాత్రమే సీఎం కేసీఆర్‌కు శ్రద్ధ ఉందని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం కోసం తాను చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారంతో 100 రోజులు పూర్తి చేసుకుందని, ఇప్పటివరకు 1,350 కిలోమీటర్లు నడిచింది తానైనా.. నడిపించింది మాత్రం ప్రజల అభిమానమేనని పేర్కొన్నారు. పాదయాత్రలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. 

బీఆర్‌ఎస్‌ అంటే బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ సర్వీస్‌ పార్టీ
రాష్ట్రంలో ఏమీ చేయలేని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశాన్ని ఉద్ధరిస్తానని బీఆర్‌ఎస్‌ పార్టీ పెడుతున్నారని, బీఆర్‌ఎస్‌ అంటే.. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ సర్వీస్‌ పార్టీ అని షర్మిల ఎద్దేవా చేశారు. అగ్నిపథ్‌ పేరుతో మోదీ నిప్పు రాజేస్తే ఇదే అదనుగా కేసీఆర్‌ ఆ నిప్పుతో చలికాచుకుంటున్నాడని విమర్శించారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో ఆరు రోజులుగా విద్యార్థులు సమ్మె చేస్తుంటే.. 12వ తరగతి కూడా చదవని విద్యామంత్రి విద్యార్థుల సమస్యలు సిల్లీగా ఉన్నాయన్నారంటే..

ఇక ఫాంహౌస్‌లో ఉన్న కేసీఆర్‌కు విద్యార్థుల సమస్యలు వినపడతాయా? అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో అధికార పార్టీ నేతల పిల్లలు ప్రభుత్వ వాహనంలో ఆడపిల్లపై అఘాయిత్యం చేస్తే కేసీఆర్‌ కనీసం నోరు విప్పలేదన్నారు. 

మరిన్ని వార్తలు