కోర్టు ఆదేశాలంటే గౌరవం లేకుండాపోయింది: షర్మిల

12 Dec, 2022 03:34 IST|Sakshi

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలపక్షాన న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే తనను, తమ పార్టీ కార్యకర్తలను బందీలుగా చేశారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. శనివారం అర్ధరాత్రి పోలీసులు దీక్షను భగ్నం చేసి అపోలో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆదివారం అక్కడ చికిత్స పొందుతున్న షర్మిల మీడియాతో మాట్లాడారు.

‘వైఎస్సార్‌ బిడ్డను పంజరంలో పెట్టి బంధించవచ్చని కేసీఆర్‌ అనుకుంటున్నారు. అది ఆయన తరం కాదు’అని స్పష్టం చేశారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా కేసీఆర్‌ పోలీసుల భుజాన తుపాకీ పెట్టి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలంటే గౌరవంలేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రకు అనుమతివ్వాలని కోరిన కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారని మండిపడ్డారు.

లోటస్‌పాండ్‌ చుట్టూ బారికేడ్లు, చెక్‌ పోస్ట్‌లు ఏర్పాటు చేశారని, ఆ ప్రాంతంలో అకారణంగా కర్ఫ్యూ విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను బలవంతంగా పోలీస్‌ వ్యాన్లలో ఎక్కించి దారుణంగా కొట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల త్యాగాలను వైఎస్సార్‌ బిడ్డ ఎన్నటికీ మరవదంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.  

లో బీపీతో ఆస్పత్రిలో చేరిక 
లో బీపీ, బలహీనత ఉండటంతో వైఎస్‌ షర్మిలను అపోలో ఆస్పత్రిలో చేర్పించారని వైద్యులు తెలిపారు. ఈ మేరకు వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ఆమె డీహైడ్రేషన్, ఆర్థోస్టాటిక్‌ హైపోటెన్షన్‌తో బాధపడుతున్నట్టు తెలిపారు. తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్‌ గ్యాప్‌ మెటబాలిక్‌ అసిడోసిస్, ప్రీ–రీనల్‌ అజోటెమియా కూడా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారని, సోమవారం ఉదయం డిశ్చార్జి చేసే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2–3 వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.    

మరిన్ని వార్తలు