ఆద్యంతం ఉద్రిక్తత, ఉత్కంఠ.. షర్మిల అరెస్ట్‌.. బెయిల్‌

30 Nov, 2022 03:23 IST|Sakshi
షర్మిల కారును క్రేన్‌ సాయంతో ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు. (ఇన్‌సెట్‌) కారులో షర్మిల

తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రగతి భవన్‌ ముట్టడికి వైఎస్‌ షర్మిల ప్రయత్నం

అడ్డుకున్న పోలీసులు..కారు దిగేందుకు షర్మిల ససేమిరా 

క్రేన్‌ సహాయంతో ఆమెతో పాటు కారు ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు

పంజగుట్ట పీఎస్‌లో షర్మిలపై 9 సెక్షన్ల కింద కేసు, అరెస్ట్‌

నాంపల్లి కోర్టులో హాజరు.. బెయిల్‌ మంజూరు

షర్మిల అరెస్టు తీరుపై గవర్నర్‌ ఆందోళన  

న్యాయం చేయాలని కోరుతూ ప్రగతి భవన్‌ ముట్టడికి షర్మిల ప్రయత్నం

ఒక ఆడపిల్లను అరెస్టు చేయించడం సీఎంకు తగునా అంటూ నిలదీత

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా నర్సంపేటలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్ర సందర్భంగా సోమవారం టీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడికి దిగడం, ఫ్లెక్సీలు తగులబెట్టడం, ఆమె కారవాన్‌కు నిప్పంటించడం తదితర సంఘటనల నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం..హైదరాబాద్‌ వేదికగా మంగళవారం కూడా కొనసాగింది. దాడికి నిరసన వ్యక్తం చేస్తూ, తనకు న్యాయం చేయాలని కోరుతూ.. దాడిలో ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ షర్మిల ప్రగతిభవన్‌ ముట్టడికి ప్రయత్నించారు.

ఆమెకు మద్దతుగా పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. అయితే షర్మిలను అడ్డుకున్న పోలీసులు..ఆమె లోపల ఉండగానే కారును క్రేన్‌ సాయంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం, ఇతర ఆరోపణలతో మరో పీఎస్‌లో షర్మిల సహా ఆరుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం, నాంపల్లి కోర్టులో హాజరుపరచడం, షర్మిల విడుదల కోరుతూ వైఎస్‌ విజయమ్మ నిరాహార దీక్షకు దిగడం వంటి పరిణామాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే షర్మిలతో పాటు ఐదుగురికి న్యాయమూర్తి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేయడంతో రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది.


షర్మిలను అరెస్టు చేసి తీసుకువెళ్తున్న పోలీసులు... 

బందోబస్తు తప్పించుకుని..
నర్సంపేటలో ఉద్రిక్తత నేపథ్యంలో షర్మిలను అదుపులోకితీసుకున్న పోలీసులు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ నివాసానికి తరలించిన సంగతి తెలిసిందే. కాగా నర్సంపేటలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సోమవారం వైఎస్సార్‌ విగ్రహానికీ నిప్పుపెట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలో షర్మిల మంగళవారం పంజగుట్ట కూడలిలోని వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు ఉదయం 10 గంటల నుంచే లోటస్‌ పాండ్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయినప్పటికీ షర్మిల తొలుత సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉంచిన ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సీఎంను కలుస్తానంటూ ప్రగతి భవన్‌కు బయలుదేరారు. అయితే పోలీసులు షర్మిల వాహనాన్ని అడ్డుకుని కిందకు దిగాలని కోరగా ఆమె నిరాకరించారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పోలీసులు డ్రైవింగ్‌ సీటులో ఉన్న ఆమెతో సహా కారును క్రేన్‌ సాయంతో ఎస్సార్‌ నగర్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.


పోలీస్‌ స్టేషన్‌లో కూర్చున్న షర్మిల... 

బలవంతంగా కారు డోర్‌ తెరిచి..
ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ వద్ద కూడా కారు దిగేందుకు షర్మిల అంగీకరించలేదు. దీంతో పోలీసులు మారు తాళాలు తయారు చేసే వ్యక్తిని తెచ్చి కారు డోర్‌ను తెరిచేందుకు యత్నించినా ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు అధికారులు కారు ఎడమ వైపు ముందు డోర్‌ను ప్లాస్టిక్‌ లాఠీల సాయంతో తెరిచారు. కారులో ఉన్న నలుగురు పార్టీ నేతలను ముందుగా అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం మహిళా పోలీసులు షర్మిలను బలవంతంగా కిందకు దింపి ఠాణా లోపలకు తీసుకువెళ్లారు. ఈలోగా షర్మిలకు సంఘీభావం తెలపడానికి వైఎస్‌ విజయమ్మ బయలుదేరారంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆమెను లోటస్‌ పాండ్‌లోనే గృహ నిర్భంధం చేశారు. ఈ చర్యలను నిరసిస్తూ, షర్మిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయమ్మ నిరాహార దీక్ష చేపట్టారు. 


నాంపల్లి కోర్టు నుంచి బయటకు వస్తున్న షర్మిల 

పలు సెక్షన్ల కింద కేసు
షర్మిలపై 143, (గుమిగూడటం) 341 (అక్రమ నిర్బంధం), 506 (బెదిరింపులు), 509 (మహిళ లను దూషించడం), 336 (ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగించడం), 353 (పోలీసు విధులకు ఆటంకం కలిగించడం), 382 (దొంగతనం), 149 (అక్రమ సమావేశం), 290 (పబ్లిక్‌ న్యూసెన్స్, దూషించడం) సెక్షన్ల కింద పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

షర్మిలతో పాటు 20 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె పీఆర్‌ఓ శ్రీనివాస్‌ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. ఎస్సార్‌నగర్‌ ఠాణాకు వచ్చిన ప్రభుత్వ వైద్యులు షర్మిలకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను నాంపల్లిలోని 14వ ఏసీఎంఎం ఎదుట పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్‌ విధించాలని కోరారు. అయితే షర్మిలపై తప్పుడు కేసులు పెట్టారని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చారు. 

న్యాయమే గెలిచింది: విజయమ్మ
షర్మిలకు న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేసిన తర్వాత వైఎస్‌ విజయమ్మ దీక్ష విరమించారు. న్యాయమే గెలిచిందని, తాము చట్టాన్ని గౌరవిస్తామని ఆమె పేర్కొన్నారు.

ఎస్సార్‌నగర్‌ పీఎస్‌కు బ్రదర్‌ అనిల్‌
షర్మిలను పరామర్శించేందుకు ఆమె భర్త అనిల్‌ ఎస్సార్‌నగర్‌ పీఎస్‌కు వచ్చారు. సమస్యలపై పాదయాత్ర చేస్తున్న షర్మిలపై దుర్మార్గంగా వ్యవహరించడం తగదన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దీనికి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

కార్యకర్తలపై లాఠీచార్జి  
షర్మిల అరెస్టు వార్తతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున ఎస్సార్‌ నగర్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కొందరు యువకులు స్టేషన్‌ ఎదురుగా ఉన్న భవ నంపైకి ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరికొందరు కార్యకర్తలు స్టేషన్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా లాఠీచార్జి చేశారు.  

షర్మిల అరెస్టును ఖండించిన కిషన్‌రెడ్డి
షర్మిల అరెస్టును కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. ఒక మహిళ పట్ల అసభ్యకరమైన రీతిలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కేసీఆర్‌ ప్రభుత్వం చూపుతున్న దురహంకారం చాలా అసహ్యకరమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల తన వాహనంలో ఉండగానే క్రేన్‌తో లాక్కెళ్లడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ప్రధాన అజెండాగా టీఆఎస్‌ఆర్‌ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. 

కారవాన్‌కు నిప్పంటించిన వారిపై కేసు
వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా శివారులో షర్మిల కారవాన్‌ను అడ్డుకుని పెట్రోల్‌ పోసి నిప్పంటించిన వారిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. జల్లీ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు తొగరు చెన్నారెడ్డితో పాటు మరికొంత మందిపై 427, 435 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బందిపోట్ల రాష్ట్ర సమితిగా మారిపోయింది: షర్మిల
అంతకుముందు ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ వద్ద షర్మిల మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై, పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పోలీసులు గూండాల్లా మారారు. బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలా పని చేస్తుందో టీఆర్‌ఎస్‌కు పోలీసులు అదే విధంగా పని చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ బందిపోట్ల రాష్ట్ర సమితిగా మారిపోయింది. ఒక ఆడ పిల్లను ఈ విధంగా అరెస్టు చేయించడం సీఎం కేసీఆర్‌కు తగునా?

నన్ను బలవంతంగా ఎందుకు అరెస్టు చేశారో ప్రజలకు చెప్పాలి. అసలు నాపై ఎందుకు దాడి చేస్తున్నారు. పాదయాత్రను కావాలనే అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అడ్డుకుంటారా? టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నించకూడదా? అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?’ అంటూ షర్మిల ధ్వజమెత్తారు.  

షర్మిల అరెస్టు తీరుపై గవర్నర్‌ ఆందోళన 
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అరెస్ట్, అందుకు దారి తీసిన పరిణామాల పట్ల గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. షర్మిల అరెస్టు తీరు పట్ల, ఆమె భద్రత, ఆరోగ్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తంచేశారు. షర్మిల లోపల ఉండగా, కారును లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కలవరపెట్టినట్లు తెలిపారు. రాజకీయ నేపథ్యం, భావజాలం ఏదైనా కావచ్చు.. మహిళా నాయకులు, మహిళా కార్యకర్తల పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరముందని గవర్నర్‌ పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు