బెల్ట్‌షాపులు లేకుండా చేస్తాం 

23 Nov, 2022 00:57 IST|Sakshi
మోకు, ముస్తాదు ధరించి కల్లుగీత కార్మికులతో మాట్లాడుతున్న షర్మిల   

కల్లు గీత కార్మికులకు భరోసా కల్పిస్తాం 

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల

భూపాలపల్లి అర్బన్‌: రాష్ట్రంలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చేస్తామని, కల్లు గీత కార్మికులకు భరోసా కల్పిస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం చిట్యాల మండలం నుంచి భూపాలపల్లి మండలంలోని కొంపెల్లి వరకు జరిగింది. యాత్రలో భాగంగా కొత్తపల్లి(ఎస్‌ఎం) శివారులోని సోలిపేట తాటివనంలో కల్లుగీత కార్మికులతో షర్మిల మాట్లాడారు.

వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గౌడన్నల సంక్షేమంపై కేసీఆర్‌ చెబుతున్నవి పచ్చి అబద్ధాలన్నారు. గౌడన్నల సమస్యలు వింటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. చెట్టుమీద నుంచి పడి చనిపోయిన కార్మికుల కుటుంబాలకు బీమా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రూ.5లక్షలు ఇస్తున్నామని చెబుతున్న సర్కార్‌ మాటలు పచ్చి అబద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్టుపైనుంచి పడి కాళ్లు, చేతులు పోయినా పరిహారం ఇవ్వలేని సర్కార్‌ ఎందుకని ప్రశ్నించారు. ఊరూరా బెల్ట్‌షాపులు తెరిచి రాష్ట్రాన్ని తాగుబోతుల అడ్డాగా మార్చి కుటుంబాలను ఆగం చేస్తున్నారని ఆరోపించారు.   

మరిన్ని వార్తలు