ముందు చెబితే వరి వేసేవారు కదా?: షర్మిల 

16 Apr, 2022 02:42 IST|Sakshi
ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో  షర్మిల పాదయాత్ర

ఇల్లెందు: ‘వరి వేస్తే ఉరి.. అన్న సీఎం కేసీఆర్‌ మాట విని రాష్ట్రంలో 17 లక్షల ఎకరాలను రైతులు బీళ్లుగా వదిలేసి నష్టపోయారు. ధాన్యం కొంటామని ముందే చెబితే రైతులందరూ వరిసాగు చేసేవాళ్లు కదా’అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో కొనసాగింది.

ఈ సందర్భంగా బొజ్జాయిగూడెంలో నిర్వహించిన రైతుగోస దీక్షలో షర్మిల మాట్లాడారు వరిసాగు చేయని రైతులకు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం అందించాలని, ధాన్యాన్ని తక్కువధరకు అమ్ముకుని మిల్లర్ల చేతిలో మోసపోయిన రైతులకు బోనస్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో రైతులకు విలువ లేకుండా పోయిందని, ఎనిమిదేళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు.

మూడెకరాల భూపంపిణీ, దళిత సీఎం హామీలతో దళితులను కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు. యాత్రలో వైఎస్సార్‌టీపీ నాయకులు బానోతు సుజాత, లక్కినేని సుధీర్‌బాబు, పిట్ట రాంరెడ్డి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. కాగా, టేకులపల్లి మండలంలో యాత్ర సందర్భంగా తేనెటీగలు దాడి చేయడంతో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో షర్మిలకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు