కేసీఆర్‌ తప్పులకు రైతులకు శిక్షా?: షర్మిల 

7 May, 2022 01:57 IST|Sakshi
సూర్యాపేట మార్కెట్‌ యార్డులో రైతులతో మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల  

సూర్యాపేట: ‘‘యాసంగి సాగు విషయంలో సీఎం కేసీఆర్‌ చేసి న తప్పులకు రైతులు శిక్ష అనుభవించాలా? రైతులపై  దయలేని కేసీఆర్‌ మనకు అవసరమా?’’అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ను ఆమె సందర్శించి రైతులతో మాట్లాడారు. మార్కెట్‌కు వచ్చి ఎన్ని రోజులైంది? ధర ఎంత ఇస్తున్నారని తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రైతులు వైఎస్సార్‌ పాలనే బాగుందని, తాము పండిస్తున్న పంటకు నీళ్లొచ్చేది ఆయన నిర్మించిన కాలువతోనేనని పేర్కొన్నారు. తర్వాత షర్మిల మార్కెట్‌ కార్యాలయంలో అధికారులను కలిసి రైతులకు అందిస్తున్న ధరపై ఆరా తీశారు. అధికారుల సమాధానం సరిగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రైతులతో కలిసి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మార్కెట్‌కు 682 మంది ధాన్యం తీసుకొస్తే ఇద్దరికే మద్దతు ధర రూ.1,920 చెల్లించారని.. మిగతా రైతులకు రూ.1,500 వరకే ఇవ్వడమేమిటని మండిపడ్డారు.

దీనికితోడు తరుగు, తాలు పేరిట కోత పెట్టడం దారుణమన్నారు. బీజేపీతో సత్సంబంధాల కోసం కేసీఆర్‌ చేసిన ఒక్క సంతకంతో రైతులు శిక్ష అనుభవిస్తున్నారని విమర్శించారు. పైగా యాసంగిలో వరి వేయొద్దంటూ రైతులను బెదిరించారని.. రైతులు బీళ్లుగా వదిలేసిన భూములకు కేసీఆర్‌ సొంత డబ్బులతో పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పిట్టా రాంరెడ్డి, ఏపూరి సోమన్న, జిల్లా అధ్యక్షుడు జిల్లేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు