రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట 

23 May, 2022 01:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కేసీఆర్‌ సర్కార్‌ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలానికి చెందిన రైతు దబ్బేట మల్లేశం ఆత్మహత్య ఇందుకు నిదర్శనమన్నారు. మల్లేశం కుటుంబానికి ఆమె సంఘీభావం తెలిపారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌పై ఆదివారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంట దిగుబడి లేక పెట్టుబడి రాకపోవడంతోపాటు చివరికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదుకొంటుందన్న ఆశ కూడా రైతుల్లో చచ్చిపోయిందన్నారు. లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి పంచాయతీ పనులు చేసిన సర్పంచ్‌లు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఫీజులు కట్టడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కేసీఆర్‌ సర్కారు వద్ద పైసలు ఉండవని ఎద్దేవా చేశారు. పంజాబ్‌ రైతులకు డబ్బులు పంచడానికి రాష్ట్రం మీ తాత జాగీరా దొరా అని సూటిగా ప్రశ్నించారు.  

మరిన్ని వార్తలు