మోదీ, కేసీఆర్‌ మధ్య చీకటి ఒప్పందాలున్నాయా?

28 May, 2022 01:42 IST|Sakshi

వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల  

సాక్షి, హైదరాబాద్‌: ‘కేసీఆర్‌ పాలన అవినీతిమయమని మోదీ అంటారు. మోదీ అవినీతి చిట్టా తన దగ్గర ఉందని కేసీఆర్‌ చెబుతారు. కానీ, ఇద్దరూ ఎదురుపడరు. ఒకరి అవినీతిని ఇంకొకరు బయటపెట్టరు. జనాన్ని మాత్రం పిచ్చోళ్లను చేస్తారు. మీవన్నీ ఉడుత ఊపుల ప్రసంగాలా? లేక చీకటి ఒప్పందాలేమైనా చేసుకున్నారా?’ అంటూ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిలదీశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాల పర్యటనపై మండిపడుతూ ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నువ్వు కొట్టినట్లు చెయ్యి.. నేను ఏడ్చినట్లు చేస్తా’అన్నట్లు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ వ్యవహారం ఉందని విమర్శించారు. ’ఢిల్లీ కోటలు బద్దలు కొడతాం, కడిగిపారేస్తాం, ఏకిపారేస్తాం’అన్న కేసీఆర్‌ సారూ.. మోదీ ఇక్కడికొస్తే మీరెక్కడికి పారిపోయారని ఆమె అన్నారు. కాగా, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను శనివారం నుంచి పునఃప్రారంభించనున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తాళ్లమడ గ్రామం వద్ద పాదయాత్ర 1000 కి.మీ పైలాన్‌ నుంచే షర్మిల పాదయాత్రను మొదలుపెట్టనున్నారు.

మరిన్ని వార్తలు