నీళ్లు కావాలంటే మద్యాన్ని పారిస్తున్నారు

3 Jul, 2022 02:31 IST|Sakshi
పొనుగోడులో మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల 

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల

గరిడేపల్లి: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు వస్తాయని అనుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ గల్లీ..గల్లీకి బార్లు ఏర్పాటు చేసి తాగుబోతుల తెలంగాణగా మార్చారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం మర్రికుంట నుంచి పొనుగోడు గ్రామం వరకు సాగింది.

ఈ సందర్భంగా ఆమె పొనుగోడు గ్రామస్తులతో ముచ్చటించారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేకపోయారన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌ చేతిలో పెడితే అప్పుల పాలు చేశారని, ప్రతి కుటుంబంపై 4 లక్షల రూపాయల వరకు అప్పులు మోపారని అన్నారు. పేదలంటే కేసీఆర్‌కు గిట్టడం లేదని, ప్రజలు నీళ్లు కావాలంటే మద్యాన్ని ఏరులుగా పారిస్తున్నారని దుయ్యబట్టారు. అయితే ఇప్పుడు ప్రజలు కేసీఆర్‌ మాటల గారడీని నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా సంతలో పశువుల్లాగా అమ్ముడుపోతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతుంటే అయ్యా, కొడుకు దేశ పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతిని««ధులు పిట్టా రాంరెడ్డి, సత్యవతి, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జిల్లేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు