అసెంబ్లీలో అడుగుపెట్టక ముందే అదిరిపడుతున్నారు: షర్మిల 

17 Sep, 2022 01:22 IST|Sakshi
జడ్చర్లలో మాట్లాడుతున్న షర్మిల 

జడ్చర్ల: ‘ఎమ్మెల్యేగా ఎన్నికై ఇంకా నేను అసెంబ్లీలో అడుగే పెట్టలేదు. కానీ, నా పేరు మాత్రం అప్పుడే అసెంబ్లీకి వెళ్లింది. నేనంటే సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ నాయకులకు భయం పట్టుకుంది. నాపై మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి స్పీకర్‌కు ఫిర్యాదు చేయడమే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన పాదయాత్ర శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చేరుకుంది.

ఈ సందర్భంగా స్థానిక నేతాజీ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యేల భూ కబ్జాలు, అవినీతి గురించి ప్రజలకు చెబితే తప్పా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న ప్రేమ పాలమూరు–రంగారెడ్డిపై లేదని విమర్శించారు. కుర్చీ వేసుకుని ప్రాజెక్టు కడతానని బీరాలు పలికిన సీఎం పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారుడని పాలన అప్పగిస్తే కేసీఆర్‌ రూ.4 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. 2 లక్షల ఉద్యోగ ఖాళీలుంటే కేవలం 17 వేల ఉద్యోగాల భర్తీకే నోటిఫికేషన్‌ వేశారని షర్మిల విమర్శించారు. 

మరిన్ని వార్తలు