గులాబీ గూటిలో ఆందోళన.. కాంగ్రెస్‌, బీజేపీకి కలిసొచ్చేనా?

20 Nov, 2022 08:01 IST|Sakshi

సిట్టింగులకే మళ్లీ టికెట్లు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన

ఆశావహుల్లో ఆందోళన

గ్రేటర్‌లో మెజారిటీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి

సాక్షి, హైదరాబాద్‌/రంగారెడ్డి జిల్లా: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం కావాలని, ప్రస్తుత సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో సిట్టింగ్‌ల్లో ఆనందం వెల్లివిరుస్తుండగా.. గ్రేటర్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో కొంతకాలంగా గ్రౌండ్‌ సిద్ధం చేసుకుంటున్న ఆశావహుల్లో మాత్రం ఆందోళన మొదలైంది. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం లభిస్తుందనే ఆశతో వివిధ నియోజకవర్గాల్లో  ఎందరో నేతలు ఎదురుచూస్తున్నారు. సీఎం ప్రకటనతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. రాజకీయ భవిష్యత్‌ అగమ్య గోచరంగా మారడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారు.  గులాబీ పార్టీలోనే కొనసాగడమా? లేక మరో దారి చూసుకోవడమా? అనే మీమాంసలో కొందరు నేతలు కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది.  

ప్రత్యామ్నాయమే ఉత్తమమా..? 
అధికారంలోకి వచ్చాక.. వివిధ పార్టీల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని గులాబీ గూటికి వచ్చేలా చేసేందుకు కొందరికి రాబోయే ఎన్నికల్లో టికెట్లిస్తామనే హామీలున్నాయి. దాంతో వారు ఆయా నియోజకవర్గాలను నమ్ముకొని పనులు చేస్తున్నారు. ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలపై ఉన్న తీవ్ర వ్యతిరేకత సైతం తమకు కలిసి వస్తుందని భావించారు. కానీ.. ఇటీవల టీఆర్‌ఎస్‌ఎల్‌పీ సమావేశంలో సీఎం చేసిన ప్రకటనతో హతాశులైన వారిలో కొందరు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ప్రతిపక్ష పార్టీల వైపు దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. 
 
గ్రేటర్‌ పరిధిలో..  
- ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా.. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ తనకు వస్తుందని భావించిన ఇదే పారీ్టకి చెందిన కార్పొరేటర్‌ విజయారెడ్డి.. తనకు టికెట్‌ వచ్చే పరిస్థితి లేదని గ్రహించి కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన శ్రవణ్‌కుమార్‌.. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ లభిస్తుందనే చేరినట్లు ఆయన వర్గీయులు భావిస్తున్నారు. మన్నె గోవర్ధన్‌రెడ్డి, మరికొందరు సైతం ఎంతో కాలం నుంచి ఇదే నియోజకవర్గంపై కన్నేసి ఉన్నారు. కానీ.. కేసీఆర్‌ ప్రకటనతో ఆశావహులకు ఏమీ పాలుపోవడం లేదు.   

- ముషీరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ముఠా గోపాల్‌ ఉన్నారు. ఈ నియోజకవర్గంపై ఎప్పటినుంచో కన్నేసి ఉన్న ఎమ్మెన్‌ శ్రీనివాస్‌ మంత్రి తలసాని అండదండలతో ఇక్కడి టికెట్‌ను దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం తదితరాలు తనకు కలిసి వస్తాయని ఆయన ఆశలు పెంచుకున్నారు.  

- అంబర్‌పేట నియోజకవర్గం నుంచి కాలేరు వెంకటేశ్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా కొనగసాగుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి కిషన్‌రెడ్డి చేతిలో ఓటమిపాలైన ఎడ్ల సుధాకర్‌రెడ్డితో పాటు ఓ కార్పొరేటర్‌ భర్త తదితరులు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. సాయన్న ప్రాతినిధ్యం వహిస్తున్న కంటోన్మెంట్‌ నియోజకవర్గం నుంచి మూడు కార్పొరేషన్ల చైర్మన్లు గజ్జెల నగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, కృషాంక్‌లు రాబోయే ఎన్నికల్లో టికెట్‌పై కన్నేసి ఉన్నారు. 

పొరుగు జిల్లాలో.. 
- ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు రాబోయే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఎల్బీనగర్‌ ఎమ్మెల్యేగా గెలిచిన దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి.. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరడం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన ఆయన చేతిలో ఓటమి పాలైన 
ఎం.రామ్మోహన్‌గౌడ్‌ సైతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశపడుతున్నారు. 

- ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపొందారు. గతంలో డీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన క్యామ మల్లేష్‌ ఆ పారీ్టకి రాజీనామా చేసి, అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన సమయంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం హామీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఆ అవకాశం కల్పించలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ తనకే వస్తుందని, ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత (సినీ నటుడు అల్లు అర్జున్‌ మామ) చంద్రశేఖర్‌రెడ్డి కూడా ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని 
భావిస్తున్నారు. 

- గత ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యరి్థగా పోటీ చేసి గెలిచిన సబితారెడ్డి.. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రిగా ఉన్నారు. ఇదే సెగ్మెంట్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సీటుపై ఆశలు పెట్టుకున్నారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఏదైనా ఒక చోట నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సహా మంత్రి సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి భావించారు. ఆ మేరకు పావులు కూడా కదిపారు. 

- ఉప్పల్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లోనే టిక్కెట్‌ వస్తుందని ఆశించి ఇప్పటికీ ఈ నియోజకవర్గంపైనే దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం ఇక్కడ బేతి సుభాష్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు.    

సమయానుకూల నిర్ణయాలు.. 
సీఎం ప్రకటన చేసినప్పటికీ, సమయానుకూల నిర్ణయాలుంటాయని కొందరు ఆశావహులు అభిప్రాయపడుతున్నారు. వయోభారం, ఆరోగ్య పరిస్థితులు తదితరాలు పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ఇప్పట్నుంచే టికెట్లు రావంటే పక్కచూపులు చూస్తారని కూడా అలా ప్రకటించి ఉండవచ్చని వారు పేర్కొంటున్నారు.  
 

మరిన్ని వార్తలు