మునుగోడుతో చేతికి అగ్నిపరీక్ష.. ఓ పక్క ఆశ, మరో పక్క కలవరం

6 Oct, 2022 18:46 IST|Sakshi

కాంగ్రెస్‌ సీనియర్ నేతలంతా సుడిగాలి పర్యటనలు

30 మంది ఓటర్లకు ఓ ఇన్‌చార్జ్‌

ఆర్థిక బలం ఉన్న నేతలే ఇన్‌చార్జ్‌లు

8 ఏళ్ళుగా ఏ ఉప ఎన్నికలోనూ గెలవని కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కాంగ్రెస్‌ను అన్నీ కష్టాలే వెంటాడుతున్నాయి. తాజాగా మునుగోడు గండం గట్టెక్కేదెలా అని పీసీసీ నాయకులు టెన్షన్ పడుతున్నారు. ఎలాగైనా గెలవాలని తెగ తంటాలు పడుతున్నారు. ఓటర్లే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి..హస్తం పార్టీ ఉట్టి కొడుతుందా? బోర్లా పడుతుందా? 

అనుకోకుండా వచ్చి పడ్డ మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌ను టెన్షన్ పెడుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏనాడూ ఉప ఎన్నికల్లో నెగ్గిన చరిత్ర కాంగ్రెస్‌కు లేదు. పైగా సిటింగ్‌ సీట్లు కూడా పోగొట్టుకుంటోంది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ వ్యవహారం కారణంగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు బీజేపీ తరపున అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సిటింగ్‌ సీటు గనుక తప్పక గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. బయటకు ఎంత ధీమాగా చెప్పినా లోలోన ఆందోళన కనిపిస్తోంది. 

మునుగోడును మళ్లీ గెలుచుకోవాలన్న పట్టుదల, ఓడిపోతామేమో అన్న భయంతో ఈసారి ముందుగానే మేల్కొన్నారు టీ.కాంగ్రెస్ నేతలు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే... ఇతర పార్టీలు అభ్యర్థిని ప్రకటించకముందే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించారు. అదే విధంగా ఎన్నికల కోసం మండలాలు, గ్రామాల వారిగా ఇంఛార్జ్ లను నియమించుకుంది. పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ ఇంఛార్జ్ లుగా వ్యవహరిస్తున్న నేతలు ప్రచారం పర్యవేక్షిస్తున్నారు. టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు కూడా అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రచారంలో పాల్గొంటూ ఐక్యతను చాటుతున్నారు.

ఇంత కష్టపడుతున్నా.. గెలుపు ధీమా కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి వరుస పర్యటనల తర్వాత క్షేత్ర స్థాయి పరిస్థితులపై పీసీసీకి అవగాహన కలిగింది. దీంతో వ్యూహాన్ని మార్చాలని కాంగ్రెస్ డిసైడయింది. పోలింగ్‌ బూత్ టార్గెట్ గా కాకుండా ఓటర్ టార్గెట్ గా ప్రచారం చేస్తే తప్ప పోటీలో ఉండలేమన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే ప్రతి 30 ఓటర్లకు ఓక ఇంఛార్జ్ ను నియమించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించేందుకు ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ రాష్ట్రానికి రావాల్సి ఉన్నా.. ఢిల్లీలో పార్టీ కార్యక్రమాల రీత్యా వాయిదా పడింది.

ఈనెల 30న మునుగోడులో బూత్, క్లస్టర్ మీటింగ్ నిర్వహించనున్నారు కాంగ్రెస్ నేతలు. అక్కడే ఓటర్ కేంద్రం గా ఇంఛార్జ్ లను నియమిస్తారు. ఇంఛార్జ్ లకు కేటాయించిన 30మంది ఓటర్లతో నిత్యం సంబంధాలు నెరుపుతూ..వారంతా కాంగ్రెస్ కు ఓటేసేలా చూసుకోవాల్సిన బాధ్యత ఇంచార్జ్‌లదే. ఓటర్ల  అవసరాలు తీర్చే ఆర్థిక బలమున్న నేతలనే ఇంఛార్జ్ లుగా నియమించేలా గాంధీభవన్‌లో బ్లూ ప్రింట్ సిద్దమవుతుంది.

గడచిన 8 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ఏ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ విజయం సాధించలేదు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందునే.. మునుగోడును ఇంత సీరియస్‌గా తీసుకుంటున్నారు హస్తం పార్టీ నాయకులు. మునుగోడులో విజయం సాధిస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో  కూడా అనుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు.

అందుకే అన్ని రకాల అస్త్రాలు ఉపయోగిస్తున్నారు. మహిళా సెంటిమెంట్‌, పాల్వాయి గోవర్థనరెడ్డిపై ఉన్న సానుభూతిని ఉపయోగించుకోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు గుర్తు చేస్తూ ఓట్లు అడగాలని ప్లాన్ చేశారు. అందుకే 30 మందికి ఒక ఇన్‌చార్జ్‌ను నియమించి కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు చేజారకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న హస్తం పార్టీకి ఏమాత్రం సానుకూల ఫలితం వస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలు