ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అరెస్ట్‌

28 Jul, 2021 11:33 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ‘దళిత బంధు’ పథకాన్ని మునుగోడు నియోజకవర్గ దళితులకు కూడా వర్తింప చేయాలని కోరుతూ.. రాజగోపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి బుధవారం మంత్రి జగదీష్‌ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు రాజగోపాల్‌ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. 

పోలీసుల చర్యలపై రాజగోపాల్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల అరెస్ట్‌ను ఖండించారు. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమ నిర్బంధాలు సరికాదని సూచించారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ మొత్తం అమలు చేయాలని రాజగోపాల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.
 
ఇక ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రసంగం అడ్డుకుని రభస చేశారని ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వో గిరిధర్ ఫిర్యాదుతో రాజగోపాల్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు