కోర్టులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు

8 Aug, 2020 04:31 IST|Sakshi

సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు కానప్పుడు బిల్లు పెండింగ్‌లో ఎలా ఉంటుంది?

సెలెక్ట్‌ కమిటీకి పంపాలంటే కచ్చితంగా ఓటింగ్‌ జరగాలి

బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని బాబు అసెంబ్లీలో ఎందుకు అడగలేదు

వికేంద్రీకరణ బిల్లుపై సభలో 11 గంటల పాటు చర్చ

స్పీకర్‌ తమ్మినేని సీతారాం

సాక్షి, అమరావతి: ‘‘కోర్టులను తప్పుదోవ పట్టించేలా కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్‌ కమిటీలో పెండింగ్‌ ఉందని కోర్టులో చెబుతున్నారు. అసలు సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు కానప్పుడు పెండింగ్‌లో ఎలా ఉంటుంది? సెలెక్ట్‌ కమిటీ వేయలేదని కార్యదర్శిపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేస్తారు. కోర్టుకు మాత్రం మరోటి చెబుతారు. సెలెక్ట్‌ కమిటీకి పంపాలంటే కచ్చితంగా ఓటింగ్‌ జరగాలి, ఓటింగే జరగనప్పుడు సెలెక్ట్‌ కమిటీ ఎలా ఏర్పాటవుతుంది’’ అని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. స్పీకర్‌గా ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా అసెంబ్లీలోని తన చాంబర్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాది కాలం స్పీకర్‌ పదవి చాలా సంతృప్తినిచ్చిందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

► బిల్లు సెలెక్ట్‌ కమిటీకి పంపాలని అసెంబ్లీలో చంద్రబాబు ఎందుకు అడగలేదు. మండలిలోనే అడగడంలో ఉద్దేశం ఏంటి?
► అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని 1997లో స్పీకర్‌గా ఉన్న యనమల రూలింగ్‌ ఇచ్చారు. ఇప్పటికీ అది అమల్లో ఉంది. యనమల ఇప్పుడెలా విభేదిస్తారు.
► అసెంబ్లీ నిర్ణయాలపై కోర్టుకు ఎందుకు వెళుతున్నారు. యనమల ఇచ్చిన రూలింగ్‌ని ఇప్పుడేం చేయమంటారో వాళ్లే చెప్పాలి.
► శాసనసభ వ్యవహారాలపై కోర్టుల జోక్యం ఉండకూడదని కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది.
► పార్లమెంట్, అసెంబ్లీల్లో తీసుకున్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదని రాజారామ్‌ పాల్‌ వర్సెస్‌ లోక్‌సభ కేసులో సుప్రీం కోర్టు చెప్పింది. 
► వికేంద్రీకరణ బిల్లులపై 11 గంటల పాటు సభలో చర్చ నిర్వహించాం. చర్చలో ప్రతిపక్షానికున్న బలం కంటే చాలా ఎక్కువ సమయం ఇచ్చాం.
► అసెంబ్లీలో చర్చ సరిగ్గా జరగలేదని విమర్శించడం తగదు. 
► త్వరలో ఆలిండియా స్పీకర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నాం.  

మరిన్ని వార్తలు