దళిత ద్రోహి చంద్రబాబు

5 May, 2022 04:34 IST|Sakshi
మాట్లాడుతున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం

టీడీపీది దొంగల ముఠా

స్పీకర్‌ తమ్మినేని సీతారాం

సరుబుజ్జిలి: దళితులను అన్నివిధాలా మోసగించిన దళిత ద్రోహి చంద్రబాబు అని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం సింధువాడలో బుధవారం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అంటూ ఎస్సీలను హేళన చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పొందూరు మండలం దల్లవలసలో దళితులతో సహపంక్తి భోజనాలకు హాజరవుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అండ్‌ కో దొంగల ముఠాగా మారి రూ.కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు.

దల్లవలస అభివృద్ధికి గత పాలకులు ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. నేరుగా దల్లవలసకు వస్తానని, అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగ వేదికపై చర్చించడానికి తాను సిద్ధమని, మీరు సిద్ధమేనా..? అని బాబుకు సవాల్‌ విసిరారు. ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న పథకాలను నిలిపివేయాలని చంద్రబాబు పదేపదే అంటున్నారని, అసలు ఏ పథకం, ఎందుకు ఆపాలో ప్రజల మధ్యకు వచ్చి చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చి, సంక్షేమం కోసం ముందడుగు వేస్తున్న అభివృద్ధి ప్రదాత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ప్రశంసించారు. 

దిగజారుడు విమర్శలు మానుకోవాలి
విద్యుత్‌ చార్జీలపై  ప్రశ్నించిన వారిని గుర్రాలతో తొక్కించి.. కాల్పులు జరిపించి ప్రాణాలు తీసిన యమధర్మరాజు చంద్రబాబు అని తమ్మినేని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు పెద్ద బాదుడు వేశారని, మళ్లీ ఏ మొహం పెట్టుకుని బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో ప్రజల వద్దకు వస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా దిగజారుడు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. 

మరిన్ని వార్తలు