ఆ నియోజకవర్గంలో పచ్చపార్టీకి సరైన నాయకుడే లేడు!

1 Sep, 2022 16:49 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

కృష్ణా జిల్లాలోని ఆ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా చెబుతారు. కాని అక్కడే పచ్చ పార్టీకి సరైన నాయకుడు లేడు. బయటి నుంచి వచ్చి పెత్తనం చేస్తున్న నేతను అక్కడి వారు పట్టించుకోవడం మానేశారట. కాని బీసీ కార్డుతో టిక్కెట్ తెచ్చుకోవాలని ఆ నాయకుడు ప్రయత్నిస్తున్నారు. అధినేత మాత్రం వేరే నేత కోసం అన్వేషిస్తున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? అసలక్కడ ఏం జరుగుతోంది? 

కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు కమ్యూనిస్టుల కేంద్రమైన గన్నవరం ... తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి అడ్డాగా మారింది. ఐతే ఇదంతా గతం ... ఇప్పుడు గన్నవరంలో సైకిల్ పార్టీ శ్రేణులను పట్టించుకునే నాధుడే లేడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. 2019లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ వైఎస్ జగన్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడై ప్రభుత్వానికి మద్దతు పలికారు. దీంతో గన్నవరం టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. దీంతో  మచిలీపట్నం నుంచి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుని తీసుకొచ్చి నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలు కట్టబెట్టింది అధిష్టానం.

బచ్చుల రూపంలో తమకో నాయకుడు దొరికాడని గన్నవరం టీడీపీ క్యాడర్ సంబరపడిపోయింది. కట్ చేస్తే పేరుకి ఇంఛార్జిగా ఉన్నాడన్నమాటే కానీ బచ్చుల కార్యకర్తలకు అండగా నిలవలేకపోతున్నారట. ఓ వర్గాన్ని మాత్రమే తన వెంటేసుకుని తిరుగుతున్నారని టాక్‌. పార్టీ కార్యక్రమాల్లో తన కోటరీని తప్ప మిగిలిన వారిని కలుపుకుపోవడం లేదట. గతంలో దేవినేని ఉమా మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో చక్రం తిప్పిన గన్నవరం మండల టీడీపీ అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు బచ్చుల వెంటే ఉంటూ అంతా తానై నడిపిస్తున్నారట. 

ఇంచార్జ్‌గా ఉంటున్న బచ్చుల అర్జునుడు తీరు నచ్చని చాలామంది గన్నవరం టీడీపీ ఆఫీస్ గుమ్మం తొక్కడం కూడా మానేశారట. మరికొందరైతే బచ్చులకు నాయకత్వ లక్షణాలే లేవు అంటూ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారట. ఇంకొందరైతే లీడర్ షిప్ క్వాలిటీస్‌ లేని ఈ బచ్చులతో మనకేల కామ్ గా ఉంటే పోలా అని సైడైపోతున్నారట. మరోవైపు గన్నవరంలో ప్రధాన సామాజిక వర్గం, టీడీపీకి అండగా ఉండే కమ్మవారిని సైతం బచ్చుల దూరం పెడుతూ వస్తున్నారట. అటు కమ్మ సామాజికవర్గం నేతలు, శ్రేణులు కూడా బచ్చుల వైఖరితో టచ్ మీ నాట్ అనేలా వ్యవహరిస్తున్నారట. పార్టీ ఏ కార్యక్రమాలు నిర్వహించినా దూరంగా ఉండి చూస్తున్నారే కానీ..ప్రత్యక్షంగా పాల్గొనడం లేదనే టాక్‌ వినిపిస్తోంది. ఎవరైనా ముఖ్యనేతలు లేదా పార్టీ అధినేత చంద్రబాబు గన్నవరం వస్తే ఎయిర్ పోర్టులో కలిసి కామ్ గా వెళ్లిపోతున్నారట . 

ఇదిలా ఉంటే నియోజకవర్గ ఇంఛార్జిగా క్యాడర్ కు అండగా నిలబడలేకపోతున్న బచ్చుల ఈసారి గన్నవరం టిక్కెట్టు తనకే ఇస్తారని ఆశలు పెట్టుకున్నాడట. ఏ సందర్భం దొరికినా వైసీపీ ప్రభుత్వాన్ని , సీఎంను తిడుతూ చంద్రబాబు దృష్టిలో పడేందుకు నానా తిప్పలు పడుతున్నారని అక్కడి కేడర్‌ చెప్పకుంటున్నారు. తాను బీసీ నాయకుడిని కాబట్టి... టీడీపీలో బీసీలకు పెద్ద పీట వేస్తామని పదే పదే డబ్బాలు కొట్టుకునే అధినేత మాట నిజమే అనుకుని గన్నవరం టిక్కెట్ తనకే ఇస్తారని ఇప్పట్నుంచే కర్చీప్ వేసుకుని రెడీగా ఉన్నాడట బచ్చుల అర్జునుడు. 

చంద్రబాబు ఆలోచనలు మాత్రం బచ్చుల ఆశలకు గండికొట్టేలా కనిపిస్తున్నాయని వినికిడి. చాలా రోజుల నుంచి చంద్రబాబు గన్నవరంలో టీడీపీ తరపున పోటీ చేసే క్యాండేట్ కోసం భూతద్ధంతో వెతుకుతున్నారట. తనదగ్గరకి వచ్చే వారిని సీటిస్తా ... గన్నవరం పోతావా అంటూ అడుగుతున్నారట. ఇదిలా ఉంటే ప్రస్తుతం నియోజకవర్గంలోని తాజా పరిణామాలను దృష్టిలో  పెట్టుకుని మొదట్నుంచి పార్టీనే నమ్ముకున్న తెలుగుదేశం క్యాడర్ మాత్రం అర్జంట్ గా సరైన నాయకుడిని ఇంఛార్జిగా నియమించకపోతే గన్నవరంలో ఉన్న కొద్దిపాటి పార్టీ కూడా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అని బాహాటంగానే చెప్పేస్తున్నారట.

ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశానికి దూరం కావడంతో...అక్కడి ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు కూడా ఆయన వెంటే నడిచారు. అందువల్లే గన్నవరంలో టీడీపీకి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థే కనిపించడంలేదు. 

మరిన్ని వార్తలు