రెండు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు.. మూడోసారి విజయం ఎటువైపో..

4 Oct, 2022 10:56 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో 2018 సాధారణ ఎన్నికల తర్వాత మూడో ఉప ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికి హుజూర్‌నగర్, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగగా ఆ రెండు చోట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. 2019లో నల్లగొండ పార్లమెంట్‌ స్థానానికి పోటీచేశారు. ఎంపీగా గెలుపొందిన ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఉత్తమ్‌ సతీమణి పద్మావతి పోటీచేయగా.. టీఆర్‌ఎస్‌ నుంచి సైదిరెడ్డి బరిలో నిలిచి విజయం సాధించారు.
చదవండి: మునుగోడుపై టీఆర్‌ఎస్‌ ఫుల్‌ ఫోకస్‌! రంగంలోకి కేటీఆర్‌, హరీశ్‌ కూడా? 

అక్కడ సిట్టింగ్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ కోల్పోయింది. నాగార్జునసాగర్‌ నియోజకవర్గం నుంచి 2018లో గెలుపొందిన నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మృతిచెందగా.. 2021లో ఉప ఎన్నిక జరిగింది. నర్సింహయ్య తనయుడు భగత్‌ టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఇక్కడ గులాబీ పార్టీ తన సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. మునుగోడులో 2018లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో నాలుగేళ్లలో జరిగే మూడో ఉప ఎన్నిక ఇది. రాజగోపాల్‌రెడ్డి ప్రస్తుతం బీజేపీ నుంచి బరిలో ఉంటున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇందులో ఏ పార్టీ విజయం సాధిస్తుందో నవంబర్‌ 6న తేలనుంది.

మరిన్ని వార్తలు