రాయలసీమ రైతుల గొంతు కోసింది చంద్రబాబే 

10 Feb, 2023 04:42 IST|Sakshi

టీడీపీ హయాంలోనే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులకు పునాది 

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ధ్వజం 

అనంతపురం టవర్‌క్లాక్‌: రాయలసీమ జిల్లాల్లోని రైతుల గొంతు కోసింది టీడీపీ అధినేత చంద్రబాబేనని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన అడ్డగోలు వ్యవహారాల వల్లే అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు కర్ణాటక ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విమర్శించారు. గురువారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలోనే కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులకు పునాదులు పడ్డాయన్నారు.

అప్పట్లో ప్రాజెక్టుల ఎత్తు పెంచినా నోరు మెదపలేదన్నారు. రెండో విడత అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు అనుమతులు వచ్చి­నా అభ్యంతరం చెప్పలేదన్నారు. దివంగత సీఎం వైఎస్సార్‌ ఉన్నప్పుడు అప్పర్‌ భద్రకు ఎలాంటి కేటాయింపులు, అనుమతులు రాలేదని గుర్తు చేశారు. 2010లో 9 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తే 2011లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చిందన్నారు.

ఈరోజుకు కూడా అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు కేటాయింపులు లేవన్నారు. 2017లో టీడీపీ హయాంలోనే ప్రాజెక్టు కోసం స్టేజ్‌–2 అనుమతులు వచ్చాయన్నారు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ప్రభుత్వం పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖలు పంపిందన్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

నాడు చంద్రబాబు అధికార యావకు నేడు రాయలసీమలో రైతులు నష్టపోవాల్సిన దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల కపటనాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. తొలి నుంచి జలవనరుల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన వ్యక్తి చంద్రబాబు అని,  2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో మాయ మాటలు చెప్పి కాలం వెళ్లబుచ్చాడని విమర్శించారు.   

మరిన్ని వార్తలు