శ్రీరాం.. నీ బండారం బయటపెడతా!

20 Jan, 2021 07:59 IST|Sakshi

సాక్షి, అనంతపురం : ‘‘టీడీపీ పాలనలో జిల్లాకు, ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గానికి జరిగిన ప్రయోజనమేమీ లేదు. మేము సాగునీరిచ్చామంటున్నావు.. ఏ నియోజకవర్గానికిచ్చావో చెప్పు. దోపిడీ తప్ప మీ కుటుంబం చేసిందేమీ లేదు. గతంలో మీకున్న ఆస్తులెన్ని.. ఇప్పుడున్న ఆస్తులెన్ని..? ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పగలవా? పరిటాల రవీంద్ర పేరు చెప్పి ఇష్టారాజ్యంగా భూములను లాక్కున్న ఘనత మీది. ప్రజాసేవే పరమావధిగా పనిచేసే మనస్తత్వం మాది. జిల్లాలో కియా ఫ్యాక్టరీ పరిసరాల్లో, రాజధాని అమరావతి ప్రాంతంలో బినామీల పేర్లతో మీరు భూములు కొనుగోలు చేయలేదా?’’ అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి  పరిటాల శ్రీరాంను ప్రశ్నించారు. వీటన్నింటికీ సంబంధించిన పూర్తి వివరాలతో పరిటాల శ్రీరాం బండారం బయటపెడతానన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్‌ సీపీ రాప్తాడు నియోజకవర్గ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పరిటాల కుటుంబం లాగా కక్షలతో దిగజారుడు రాజకీయాలను చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.  చదవండి: విద్యార్ధినులపై వేధింపులు.. గురువుకు 49 ఏళ్ల జైలు శిక్ష 

జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించు 
టీడీపీ హయాంలో అభివృద్ధి జరిగిందని చెబుతున్న శ్రీరాం కుటుంబమే రాప్తాడు, పెనుకొండ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఎమ్మెల్యేలుగా ఉన్నారని, నిజంగా వారు అభివృద్ధి చేసి ఉంటే.. ఒకసారి ప్రజలకూ చుపించగలరా? అని ఎమ్మెల్యే   ప్రకాష్‌రెడ్డి సవాల్‌ విసిరారు. తాము ఏదో సాధించామని చెబుతున్న శ్రీరాం పేరూరు డ్యాంకు నీరు ఎందుకు తీసుకురాలేకపోయారో వివరించాలన్నారు. రూ.800 కోట్ల కాంట్రాక్టు పనులు మంజూరైతే వాటిలో పరిటాల కుటుంబం వాటా రూ.300 కోట్లు ఉందని ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ హయాంలో అభివృద్ధే జరిగి ఉంటే.. రాప్తాడు నియోజకవర్గాన్ని ఎందుకని ‘అహుడా’ పరిధిలోకి చేర్చలేదో చెప్పాలన్నారు. రాప్తాడులో జరుగుతున్న అభివృద్ధితో ఇక్కడ తమకు దిక్కు లేదని తెలిసిన పరిటాల శ్రీరాం.. ఇప్పుడు ధర్మవరానికి చేరుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడన్నారు.  

ప్రజా శ్రేయస్సుపై దృష్టి సారించాం 
తాము అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి కాగా.. ప్రతి క్షణం నియోజకవర్గ అభివృద్ధికి పనిచేశామన్నారు. పరిటాల కుటుంబీకులు మాత్రం మండలానికో ఇన్‌చార్జ్‌ని నియమించుకొని దోచుకుతిన్నారన్నారు. పేదల ఇండ్ల కోసం ఇష్టారాజ్యంగా వసూలు చేసిన ఘనత మీ మహేంద్రదనే విషయాన్ని శ్రీరాంకు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి గుర్తుచేశారు. జాకీ పరిశ్రమతో కేవలం వెయ్యి కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని గత ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. కానీ తాము మాత్రం 15వేల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని చూస్తున్నామన్నారు. పాల డెయిరీ ద్వారా మహిళలకు అండగా నిలవాలని వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. 

>
మరిన్ని వార్తలు