దొంగ రాతలు దొంగ మాటలు

17 Nov, 2021 02:48 IST|Sakshi

ఆ దొంగ ఓటర్లు తెలుగుదేశం పార్టీ వాళ్లే..పట్టుబడ్డ 15 మంది టీడీపీ వారూ దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారే

వైఎస్సార్‌సీపీ ఓటర్లు అంటూ విష ప్రచారం.. ప్రయాణికులు, స్కూల్‌ సిబ్బందిపైనా దాడి

ప్రతీ బూత్‌లోనూ టీడీపీ సీనియర్లే ఏజెంట్లు

ఫొటో ఐడీ లేకుండా ఎవరినీ అనుమతించే అవకాశంలేదు

అప్పుడు దొంగ ఓట్లకు ఆస్కారం ఎక్కడ? 

‘దొంగ ఓట్ల దందా’ అంటూ మొదటిపేజీ పతాక శీర్షికలో సోమవారం ‘ఈనాడు’ వేసిన ఫొటో ఇది. దొంగ ఓటర్లను పట్టుకున్న పోలీసులు... అంటూ చంద్రబాబుకు మద్దతుగా వైఎస్సార్‌సీపీని టార్గెట్‌ చేసింది ఆ పత్రిక. కానీ ఈ ఫొటోలోని ఇద్దరూ ఎవరో తెలుసా? పోలీసు అధికారి ఎడమ చేతివైపు ఉన్నది అక్కడి గుడుపల్లి మండలం దిన్నేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత నారాయణ. పక్క ఫొటోలో ఈయన్ను టీడీపీ కండువాతో చూడొచ్చు కూడా. ఇక పోలీసు అధికారికి కుడివైపున్నది టీడీపీ మాజీ జెడ్పీటీసీ. పేరు మామ కృష్ణప్ప. ఇది చూస్తే తెలియటం లేదా? టీడీపీ పెద్ద ఎత్తున స్థానికేతరులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నించిందని. ఎన్ని చేసినా తాము ఓడిపోతున్నామని తెలియటంతో... తిరిగి వైఎస్సార్‌సీపీ వైపు వేలు చూపించి దొంగ ఓట్ల డ్రామా ఆడిందని!. ఆ డ్రామాకు బాబు అనుకూల పత్రికలు వంత పాడాయని!!.   

సాక్షి, తిరుపతి: దొంగే దొంగా.. దొంగా అన్నట్లుగా కుప్పంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది. ఇక్కడ సోమవారం జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో ఎక్కడా దొంగ ఓట్లు వేసేందుకు ఏమాత్రం అవకాశం లేకపోయినా.. ఎవరి నుంచీ ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా ఆ పార్టీ చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. నిజానికి.. టీడీపీ శ్రేణులే దొంగ ఓటర్ల అవతారం ఎత్తినట్లు ఈ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్తుండగా టీడీపీ నాయకులే వారి అనుచరులను పట్టుకుని వైఎస్సార్‌సీపీకి దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారంటూ నానా యాగీ చేశారు. అంతటితో ఆగకుండా.. కుప్పం మీదుగా వెళ్లే ప్రయాణికులు.. పాఠశాలలో పనిచేసే సిబ్బందిపైనా దొంగ ఓటర్లుగా ముద్ర వేసి తమ అనుకూల మీడియా ద్వారా వారిపై విషప్రచారం చేశారు. వాస్తవానికి కుప్పం ఎన్నికల్లో ఎక్కడా దొంగ ఓట్లు పోలవ్వలేదు. అయినా, దొంగ ఓటర్లు వచ్చారంటూ ఆందోళనలకు దిగడంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

భారీ పోలింగ్‌తో బాబులో వణుకు.. అల్లర్లకు ఆదేశం
కుప్పం మున్సిపాలిటీ ఏర్పడ్డాక సోమవారం మొదటిసారి ఎన్నికలు జరిగాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. భారీ పోలింగ్‌కు తోడు మహిళలు ఎక్కువ సంఖ్యలో బారులు తీరడంతో చంద్రబాబులో వణుకు మొదలైంది. వెంటనే ఎన్నికల్లో అలజడులు సృష్టించాలని జిల్లా టీడీపీ నాయకులను ఆదేశించారు. నిమిషాల్లో  స్థానికేతరులైన టీడీపీ శ్రేణులు కుప్పంలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వారికి అమరావతి నుంచి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ శ్రేణులు నేరుగా 16, 17 వార్డులకు చేరుకున్నాయి.

16వ వార్డులోకి గుడుపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాలకు చెందిన కార్యకర్తలను రంగంలోకి దింపారు. పథకం ప్రకారం.. గుడుపల్లి మాజీ జెడ్పీటీసీ బేటప్పనాయుడు మామ ఓఎం కొత్తూరుకు చెందిన కృష్ణప్ప, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు బాబు అనుచరుడు దిన్నేపల్లికి చెందిన నారాయణ, మరికొంత మందిని పోలింగ్‌ బూత్‌లోకి పంపారు. వారు బూత్‌లోకి వెళ్తుండగా టీడీపీ వారే దొంగ ఓట్లు వేసేందుకు వెళ్తున్నారంటూ కేకలు వేశారు. నిజానికి.. పోలింగ్‌ బూత్‌లోకి స్థానికేతరులు చొరబడుతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానికేతరులను పంపించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కృష్ణప్ప, నారాయణ, మరికొందరు పోలింగ్‌ బూత్‌లోకి చొరబడుతుండగా స్పెషల్‌ పార్టీ పోలీసులు అడ్డుకున్నారు. వారిని తీసుకెళ్లి స్టేషన్‌లో అప్పగించారు. అదే విధంగా మరో 15 మంది టీడీపీ శ్రేణులను కూడా స్టేషన్‌లో అప్పగించారు.

ప్రయాణికులు.. స్కూలు సిబ్బందిపైనా దాడి
ఇక విజయవాణి స్కూల్‌లో పనిచేస్తున్న సిబ్బంది పోలింగ్‌ రోజు సెలవు కావడంతో అక్కడే ఉన్నారు. వారిని గమనించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు స్కూల్లోకి చొరబడి వారిపై దాడిచేశారు. తాము దొంగ ఓటర్లు కాదని మొత్తుకుంటున్నా టీడీపీ శ్రేణులు, వారి అనుకూల మీడియా వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా వారిని ఫొటోలు, వీడియోలు తీసి విస్తృతంగా ప్రచారం చేసేశారు.

ఇలా తమ పరువు తీశారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు.. బస్టాండ్‌కు వెళ్లే ఇద్దరు ప్రయాణికులను పట్టుకుని వైఎస్సార్‌సీపీకి దొంగ ఓట్లేసేందుకు వచ్చారంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వారిని టీడీపీ పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చి చితక్కొడుతుంటే గమనించిన స్పెషల్‌ పార్టీ పోలీసులు అడ్డుకున్నారు. విచారించి వారిని క్షేమంగా బస్సెక్కించారు. ఇక 17వ వార్డులో ఎవ్వరూ దొంగ ఓట్లు వేసేందుకు రాకపోయినా.. దొంగ ఓటర్లు అంటూ స్థానికులను చూపిస్తూ ఏకంగా పోలింగ్‌ బూత్‌లోని కుర్చీలను కూడా విరగ్గొట్టి నానా హంగామా చేశారు.

లోకేష్‌ సూచించిన నేతలే ఏజెంట్లు
ఎన్నికలకు ముందు ప్రచారానికి వచ్చిన నారా లోకేశ్‌.. ఏయే బూత్‌లలో ఎవరెవరు ఏజెంట్లు కూర్చోవాలో నిర్ణయించారు. లోకేశ్‌ నిర్ణయం మేరకే బూత్‌లలో టీడీపీ ఏజెంట్లను కూర్చోబెట్టారు. వీరంతా సీనియర్‌ నేతలే కూడా.  దొంగ ఓట్లు వేసే అవకాశమే లేకుండా ఎన్నికల కమిషన్‌ పటిష్ట చర్యలు తీసుకుంది. ఏజెంట్ల వద్ద ఫొటోలతో ఉన్న ఓటర్ల జాబితా ఇచ్చారు. ఓటు వేసే వారు కూడా ఆధార్‌ కార్డు తీసుకొచ్చి ఏజెంట్లకు చూపించి ఓటు వేశారు. ఎక్కడైనా ఎవరికైనా అనుమానం వస్తే వెనక్కు పంపేందుకు పక్కాగా ఏర్పాట్లుచేశారు. మరోవైపు.. కుప్పంలో ఎక్కడా ఒకరి ఓటు ఒకరు వేసినట్లు ఫిర్యాదులు అందలేదు. అయినా టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ దొంగ ఓట్లు వేయిస్తోందంటూ రచ్చరచ్చ చేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. 

మరిన్ని వార్తలు