ఖమ్మం పాలిటిక్స్‌లో కలకలం

2 Jan, 2023 01:27 IST|Sakshi

వచ్చే ఎన్నికల్లో తన టీమంతా పోటీకి సిద్ధమని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన

తనను దెబ్బతీసేందుకు పార్టీలో ప్రయత్నాలంటూ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఆరోపణలు

ఇదే బాటలో తన అనుచరులతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనం

నూతన సంవత్సరం సందర్భంగా ముగ్గురు నేతల బల ప్రదర్శన

నాలుగున్నరేళ్లలో ఏం జరిగింది? ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది అందరికీ తెలుసు. ఈరోజు బీఆర్‌ఎస్‌లో ఉన్నాం. కానీ పార్టీలో దక్కిన గౌరవం ఏమిటి? భవిష్యత్‌లో జరగబోతున్నది ఏమిటి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు నా టీం సిద్ధంగా ఉంది.. 
– మాజీ ఎంపీ పొంగులేటి 

గతంలో నన్ను దెబ్బకొట్టేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారాలు చేశారు. మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. డబ్బుతోనే అన్నీ సాధ్యం కావు. క్యారెక్టర్, గుణం అవసరం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు అవసరం..  
– మంత్రి పువ్వాడ అజయ్‌

నా రాజకీయ ప్రస్థానంలో ముగ్గురు సీఎంల వద్ద మంత్రిగా పనిచేశాను. ఉమ్మడి జిల్లాకు నేనేం చేశానో, పాలేరు నియోజకవర్గానికి ఏం చేశానో అందరికీ తెలుసు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను పాలేరు నుంచే పోటీ చేస్తా. నా వెంట నిలిచేవారికి అండగా ఉంటా.. 
– మాజీ మంత్రి తుమ్మల 

..ఒకరు మాజీ ఎంపీ, మరొకరు మంత్రి, ఇంకొ­కరు మాజీ మంత్రి.. ముగ్గురూ ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలే.. జిల్లాలో అనుచరులు, అభిమానగణం ఉన్న­వారే.. పార్టీలో, ప్రభుత్వంలో తమకు దక్కుతున్న ప్రాధాన్యంపై అసంతృప్తితో ఉన్నవారు ఇద్దరు, ఆ అసంతృప్తిని దీటుగా ఎదుర్కొని నిలబడాలన్న ఆలోచనతో ఉన్నవారు మరొకరు.. మొత్తానికి ఆధిపత్యం కోసమో, రాజకీయ భవిష్యత్తు కోసమో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తమ కార్యచరణకు పదును పెట్టుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకలు వేదికగా అనుచరులతో సమావేశాలు పెట్టి బల ప్రదర్శన చేసుకున్నారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.  
– సాక్షి ప్రతినిధి, ఖమ్మం/ఖమ్మం మయూరి సెంటర్‌ 

తుమ్మల.. ఎన్నికల రిహార్సల్‌! 
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నూతన సంవత్సర వేడుకల పేరిట ఖమ్మం రూరల్‌ మండలంలో తన అనుచరగణం, కేడర్‌తో ఆత్మీయ సమ్మేళనంనిర్వహించారు. తాను పాలేరు నుంచే పోటీ చేస్తానంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన తుమ్మల.. ఈ కార్యక్రమంలో మరోసారి స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ముగ్గురు సీఎంల వద్ద మంత్రిగా పనిచేశానని చెప్పారు.

ఉమ్మడి జిల్లాకు ఏమేం చేశారో, పాలేరు నియోజకవర్గానికి ఏం చేశారో వివరించారు. అయితే ఈ కార్యక్రమం వచ్చే ఎన్నికలకు రిహార్సల్‌గా, బల ప్రదర్శనగా చెప్పవచ్చని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల పాలేరు నియోజకవర్గంలో స్పీడ్‌ పెంచారని అంటున్నారు. 

నన్ను దెబ్బతీసే ప్రయత్నాలు 
‘వాడవాడ పువ్వాడ’ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 
గతంలో తనను దెబ్బకొట్టడం కోసం అనేక ప్రయత్నాలు జరిగాయని, రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారాలు చేశారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆరోపించారు. ఆయన ఆదివారం ఖమ్మంలో ‘వాడవాడ పువ్వాడ’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

కొందరు తనపై నేరుగా ఆరోపణలు చేయలేక కార్పొరేటర్లను తులనాడి, వారిపై విషప్రచారం చేసి తనకు నష్టం చేయాలని చూశారని పువ్వాడ ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. డబ్బుతోనే అన్నీ సాధ్యం కాదని, క్యారెక్టర్, గుణం అవసరమని పేర్కొన్నారు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు అవసరమని.. ఆ విలువలకు కట్టుబడి ప్రజల అవసరాలు తీరుస్తూ ఎవరి దగ్గరా ఏమీ ఆశించకుండా సంక్షేమం, అభివృద్ధి విషయంలో ముందుకుపోతున్నానని చెప్పారు. 

వచ్చే ఎన్నికల్లో నా టీమ్‌ పోటీ చేస్తుంది 
బీఆర్‌ఎస్‌లో జరిగిన గౌరవం ఏమిటో ఆలోచించాల్సి ఉంది: పొంగులేటి శ్రీనివాసరెడ్డి 
ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌ కీలకనేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన ఖమ్మంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి పొంగులేటి అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో దీనికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్లలో ఏం జరిగింది, తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఈ రోజు బీఆర్‌ఎస్‌లో ఉన్నామని, కానీ ఆ పార్టీలో జరిగిన గౌరవమేంటి? భవిష్యత్‌లో జరగబోతున్న గౌరవం ఏమిటనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ప్రేమ, అభిమానాలు పొందిన, పొందుతున్న ప్రతీ నాయకుడు ప్రజాప్రతినిధి కావాలని, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శీనన్న (తన) టీమ్‌ అంతా సిద్ధంగా ఉందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు. 

ఎంపీగా గెలిచి.. బీఆర్‌ఎస్‌లో చేరి.. 
వైఎస్సార్‌సీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అనుచరులు, అభిమానులను సంపాదించుకున్నారు. 2014లో ఎంపీగా గెలిచారు. వైరా, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. కానీ తర్వాతి రాజకీయ పరిణామాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌)లో చేరారు. ఈ క్రమంలో రాజకీయ జీవితం కొంత ఒడిదుడుకులకు లోనైంది.

సిట్టింగ్‌ అయిన ఆయనను కాదని.. నామా నాగేశ్వరరావుకు గులాబీ పార్టీ టికెట్‌ దక్కింది. ఏదైనా నామినేటెడ్‌ పదవి వస్తుందని పొంగులేటి ఆశించినా ఫలితం రాలేదు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకే చెందిన పువ్వాడ అజయ్‌కు ప్రాధాన్యం దక్కడం, తుమ్మల నాగేశ్వర్‌రావు తిరిగి పట్టుపెంచుకునే ప్రయత్నాలు చేయడంతో.. ఆయన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.  

మరిన్ని వార్తలు