ముందస్తా? పార్టీ మారతారా? తుమ్మల హాట్‌కామెంట్స్‌పై చర్చ

3 Aug, 2022 17:34 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: తెలంగాణ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణంలో అయినా పిడుగు పడొచ్చు.. ఎన్నికల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన.

గతంలో చేసిన తప్పులు పునరావృతం కావొద్దు అంటూ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో ఆయన వ్యాఖ్యలపై రకరకాల చర్చ నడుస్తోంది. పార్టీ మార్పుపై తుమ్మల నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటూ ఓవైపు..  మరోవైపు ఆయన వ్యాఖ్యలు ముందస్తు ఎన్నికలను ఉద్దేశించి చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి పర్యటనలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడంటూ కొందరు కార్యకర్తలు ఆయన్ని ప్రశ్నించగా.. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు, సిద్ధంగా ఉండాలంటూ ఆయన కామెంట్లు చేశారు. 

ఇదిలా ఉంటే.. ఖమ్మం టీఆర్‌ఎస్‌లో చాలాకాలంగా అంతర్గత పోరు నడుస్తోంది. తుమ్మల క్రియాశీలక రాజకీయాలతో పాటు టీఆర్‌ఎస్‌ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున పాలేరు నుంచే బరిలో దిగాలని భావిస్తున్నారు. అందుకే మళ్లీ క్రియాశీలకంగా మారారు. 

అయితే.. ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల చేరికతో తన వర్గ బలాన్ని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో తుమ్మల పార్టీ మారతారనే చర్చ సైతం జోరుగా నడుస్తూ వస్తోంది. అయితే టికెట్‌ విషయంలో టీఆర్‌ఎస్‌ ఎలా వ్యవహరించబోతుందన్నదే ఇప్పుడు కీలకంగా మారనుంది.

మరిన్ని వార్తలు